పది మంది మంత్రులపై తీవ్ర వ్యతిరేకత ఉందని సీఎం కేసీఆర్ కు అందిన ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా తేలింది. 10మందిపై వ్యతిరేకత ఉండటంతో ఇది నిజమో కాదో తెలుసుకునేందుకు ఈ రిపోర్ట్ ను క్రాస్ చెక్ చేసుకునేందుకు థర్డ్ పార్టీ సర్వే చేయించారు కేసీఆర్. అయినా ఫలితం సేమ్ రావడంతో మంత్రులను కేసీఆర్ అలర్ట్ చేశారు. ఓటమికి దగ్గరలో ఉన్నారని…గెలుపు వరించాలంటే అంత ఈజీ కాదని మంత్రులకు కేసీఆర్ క్లాస్ పీకినట్లు సమాచారం. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఓటమిని ఆహ్వానించినట్లు అవుతుందని హెచ్చరించారు. కొసమెరుపు ఏంటంటే.. గజ్వేల్ లో కేసీఆర్ కూడా డేంజర్ జోన్ ఉన్నట్లు సమాచారం.
1.శ్రీనివాస్ గౌడ్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై భూకబ్జాలతోపాటు తన వ్యతిరేకులకు అనుచరులతో బెదిరించినట్లు ఆరోపణలు ఉండటంతో ఆయనపై వ్యతిరేకత మరింత పెరిగింది. మంత్రిగా నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేసింది లేదని…సొంత ఎదుగులకు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు ఉన్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుంది. వరుసగా రెండుసార్లు గెలవడం.. ఆయన ప్రత్యర్ధులపై సింపథీ పెరగడం కూడా ఆయన డేంజర్ జోన్ లో ఉండటానికి ఓ కారణంగా తెలుస్తోంది. శ్రీనివాస్ గౌడ్ వైఖరి నచ్చక సొంత పార్టీ నేతలు కూడా ఆయనకు దూరంగా ఉంటున్నారు.
2.కొప్పుల ఈశ్వర్ : నిజానికి కొప్పుల ఈశ్వర్ కు ఈసారి టికెట్ రాదనీ అంత అనుకున్నారు. కానీ అక్కడి నుంచి బీఆర్ఎస్ తరుఫున బలమైన నేత లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో కొప్పులకు టికెట్ ఇచ్చారన్న వాదనలు ఉన్నాయి. గత ఎన్నికల్లోనే బొటాబొటీ మెజార్టీతో నెగ్గిన కొప్పుల ఈసారి ఓటమి ఖాయమని అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మంత్రిగా కొప్పుల నియోజకవర్గానికి చుట్టపు చూపుగా రావడం తప్ప నియోజకవర్గ సమస్యలను పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. రోడ్లు, స్కూల్స్ భవనాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వంటి వాటిలో మంత్రి చెప్పుకోదగ్గ రీతిలో పని చేయలేదని ఓటర్లు భావిస్తున్నారు. ఇవే కొప్పులకు బ్రేకులు వేస్తాయని అంటున్నారు.
3.జగదీశ్వర్ రెడ్డి :సూర్యాపేటలో హ్యాట్రిక్ విజయం కోసం మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పరిస్థితి జగదీశ్వర్ రెడ్డికి ఏమంత అనుకూలంగా లేదు. ఆయనతో నడిచిన నేతలే ఆయనకు వ్యతిరేకం అవుతున్నారు. సొంత పార్టీకి చెందిన బీసీ లీడర్లపై మంత్రి కేసులు పెట్టిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది వచ్చే ఎన్నికల్లో జగదీశ్వర్ రెడ్డికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఇద్దరు నేతలు దామోదర్ రెడ్డి , పటేల్ రమేష్ రెడ్డిలు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వారి మధ్యనున్న వర్గపోరే తనకు అనుకూలంగా మారుతుందని లెక్కలు కడుతున్నారు కానీ కర్ణాటక ఎన్నికల తరహాలో వారిద్దరూ కలిసి పని చేస్తే జగదీశ్వర్ రెడ్డి ఓటమి ఖాయం.
4.సబితా ఇంద్రారెడ్డి : మహేశ్వరం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి గెలవాలని ఆరాటపడుతున్నారు. కానీ ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడిన తీగల కృష్ణారెడ్డి ఆమెకు సహకరిస్తారా.? అనేది అనుమానమే. ఆమె భూకబ్జాలకు పాల్పడుతుందని ఆ మధ్య సంచలన ఆరోపణలు చేసిన తీగల… ఎన్నికల్లో సబితా గెలుపు కోసం పని చేయడం సందేహమే. ఆయన కనుక సబితకు వ్యతిరేకంగా పని చేస్తే మహేశ్వరంలో సబిత విజయం దూరమైనట్లే. అదే సమయంలో గతంలో ఆమె వెంట బీఆర్ఎస్ లో చేరిన నేతలు కూడా మెల్లగా కాంగ్రెస్ లో చేరుతున్నారు.
5.ఎర్రబెల్లి దయాకర్ : గత కొన్ని నెలల వరకు ఎర్రబెల్లికి ఓటమి భయం లేదని అనుకున్నారు. కానీ పాలకుర్తి నుంచి ఝాన్సీరెడ్డి రూపంలో ఎర్రబెల్లికి ఓటమి భయం ఎదురుఅవుతోంది. ఎన్నారై అయిన ఝాన్సీరెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితురాలు. ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల ఆదరణ చూరగొన్నారు. ఆమె కాంగ్రెస్ తరుఫున ఈసారి పోటీ చేయనుండటంతో ఎర్రబెల్లి వర్గంలోని కొంతమంది లీడర్లు కూడా ఝాన్సీరెడ్డి వెంట నడిచేందుకు రెడీ అవుతున్నారు. పాలకుర్తి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన సుధాకర్ రావుకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్ పదవి ఇచ్చినా ఆయన ఎర్రబెల్లి గెలుపు కోసం పని చేయడం సాధ్యమేనా అనేది పార్టీలో ఓ చర్చ జరుగుతోంది.
6.ప్రశాంత్ రెడ్డి : బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇక్కడ నుంచి కాంగ్రెస్ , బీజేపీ అభ్యర్థులు బలమైన పోటీదారులుగా ఉన్నారు. బీజేపీ తరుఫున ప్రశాంత్ రెడ్డి మేనత్త కొడుకు పోటీలో ఉండనున్నారు. గత కొంతకాలంగా ప్రశాంత్ రెడ్డి అనుచరుల అక్రమాలను బయటపెడుతున్నారు. మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అలాగే, ప్రశాంత్ రెడ్డి గెలుపు కోసం గతంలో పని చేసిన మంత్రి అయ్యాక పట్టించుకోవడం లేదని అసంతృప్తి పార్టీ నేతల్లో ఉంది. దాంతో వారంతా ఆయన గెలుపు కోసం ఈసారి పని చేయడం కష్టమేనని తెలుస్తోంది.
7.గంగుల కమలాకర్ : గంగులకు సొంత పార్టీ నేతల నుంచే తిప్పలు తప్పేలా లేవు. మాజీ మేయర్ రవీందర్ సింగ్, ప్రస్తుత మేయర్ సునీల్ రావు వర్గాలు గంగుల గెలుపు కోసం పని చేస్తాయా..? అనేది చర్చ జరుగుతోంది. మంత్రికి సన్నిహితంగా ఉండే కాంట్రాక్టర్లు చేసిన పనుల్లో నాణ్యత లేకపోవడం…అవన్నీ బయటకు వచ్చినా వారిపై చర్యలు తీసుకోకపోవడంతో గంగులపై ప్రజలు అసహనంగా ఉన్నారు. నిఘా వర్గాలు ఈ విషయాన్ని గుర్తించాయి.
8.మల్లారెడ్డి : మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. భూకబ్జా ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. పార్టీ నేతలతో కూడా సఖ్యతగా ఉండడని పార్టీ నేతలే బహిరంగంగా చెప్తున్న మాట. గతంలో మల్లారెడ్డి కోసం పని చేసిన నేతలు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా తెరవెనక ప్రత్యర్ధుల గెలుపు కోసం పని చేస్తారు అనే అనుమానాలు బీఆర్ఎస్ నేతల్లోనే కల్గుతున్నాయి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మల్లారెడ్డికి వ్యతిరేకంగా పని చేసే అవకాశం ఉందని టాక్.
9.తలసాని : ఆయన ఆధిపత్య వైఖరే తలసాని కొంప ముంచనుంది. హైదరాబాద్ కు నేనే రాజు.. నేనే మంత్రి అనే తరహలో వ్యవహరించడం.ఎస్టీ నేతలపై చేయి చేసుకోవడం.. దేవస్థానాల్లో ఉమ్మేయడం వంటి చేష్టలతో తలసాని వివాదాల్లోకెక్కారు. అభివృద్ధి విషయంలోనూ ఏమంత మార్క్ చూపించలేదని విమర్శలు వస్తున్నాయి.
10. ఇంద్రకరణ్ రెడ్డి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై నిర్మల్ నియోజకవర్గాల్లో భారీ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయనపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుందని నిఘా వర్గాలు గుర్తించాయి. సొంత పార్టీ లీడర్లు కూడా ఇంద్రకరణ్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారని.. ఎన్నికల వేల మాత్రమే తమతో సన్నిహితంగా ఉంటారని ఆ తరువాత తమను పట్టించుకోరని అసంతృప్తిగా ఉన్నారు.
ఈ పది మంది మంత్రులపై ఊహించని రీతిలో వ్యతిరేకత ఉందని కేసీఆర్ అందిన రిపోర్ట్ లో ఉన్నట్లు సమాచారం. దాంతో రెండు, మూడు రోజుల్లో మంత్రులతో సమావేశమై కేసీఆర్ వారిని గైడ్ చేసే అవకాశం ఉంది.
Also Read : కాంగ్రెస్ లో మైనంపల్లి చేరికకు ముహూర్తం ఫిక్స్..?