తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి స్వరాలు వినిపించకుండా హైకమాండ్ చర్యలు చేపడుతోంది. ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారో గుర్తిస్తూ వారిని లైన్ లో పెడుతున్నారు. ఎన్నికల కమిటీలో తమకు చోటు లభించలేదని అలక వహించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు మధుయాష్కీలకు స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించారు. సీనియర్లు ఎవరూ అసంతృప్తికి గురి కాకుండా ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాలో చాలామంది సీనియర్లకు చోటు కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు. పార్టీకి సీనియర్లు దూరం కాకుండా, ఎవరిని అసంతృప్తికి గురి కాకుండా హైకమాండ్ పూర్తి స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు లేవని.. అంత ఐక్యంగా ఉన్నారని సందేశాన్ని ఇచ్చేందుకు బస్సు యాత్రను హైకమాండ్ పరిశీలిస్తోంది. నేతలందరూ ఉత్తర తెలంగాణను కవర్ చేసేలా పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది..? అనే విషయాన్నీ పరిశీలించి తేదీలను ఖరారు చేయనున్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా పార్టీలో విబేధాలు లేవని.. అందరూ కలిసిపోయారని.. పార్టీ అధికారంలోకి వస్తే సుస్థిరమైన పాలన అందిస్తామనే వాగ్దానం ఇచ్చినట్లు అవుతుందనే తలంపుతో కాంగ్రెస్ అగ్రనేతలు ఉన్నారు. ఎన్నికల రెండు నెలల సమయం ఉండటంతో బస్సు యాత్ర చేపడితే పార్టీకి కొంత ఊపు వస్తుందనే అంచనాతో ఉన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ వెలువడే అవకాశం ఉంది.
కాంగ్రెస్ లో కొంతకాలంగా అసంతృప్తి రాగాలు పెద్దగా వినిపించడం లేదు. పార్టీలో రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో కొనసాగుతుందనే వాదనలు ఉన్నప్పటికీ.. ఆయనకు హైకమాండ్ పూర్తిగా అధికారాలు ఇవ్వలేదని.. ప్రస్తుతం జరుగుతున్న అన్ని నిర్ణయాలు హైకమాండ్ ఆదేశాలతోనే జరుగుతున్నాయనే అభిప్రాయాలను సీనియర్ నేతల్లో కల్గించేలా పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. మరోవైపు , పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని.. ఎన్నికల సమయంలో ఎవరూ పార్టీ లైన్ దాటవద్దని ఇటీవల హైకమాండ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళినట్లు సమాచారం.
ఎప్పుడు అలకలు, అసంతృప్తి స్వరాలతో కనిపించే కాంగ్రెస్ నేతలు కొంతకాలంగా పార్టీ విజయంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.