చాలా ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు వేగంగా జరిగిపోతున్నాయి. పార్టీలో చేరికల నుంచి సభలు, సమావేశాలు. ఇలా అన్నింట్లోనూ కాంగ్రెస్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వేగవంతమైన నిర్ణయాలను చూసిన వారంతా ఇది కాంగ్రెస్ పార్టీనేనా? అనే ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తిగా ఉన్నారని తెలిస్తే చాలు.. ఆలస్యం చేయకుండా పార్టీ కండువా కప్పేస్తున్నారు. మరో పార్టీకి అవకాశం ఇవ్వకుండా నేతల చేరికల విషయంలో రేవంత్ రెడ్డి పకడ్బందీగా సాగుతున్నారు. పీసీసీ అద్యక్ష బాధ్యతలను రేవంత్ చేపట్టాక పార్టీలో వేగం బాగా పెరిగిందని ప్రస్తుతం పరిణామాలను బట్టి అర్థం అవుతోంది. గతంలో పార్టీలో చేరికల విషయంలో నాన్చి, నాన్చి ప్రత్యర్ధి పార్టీలకు అవకాశం ఇచ్చే కాంగ్రెస్.. రేవంత్ అద్యక్షుడు అయ్యాక ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. దూకుడు తన నైజంగా ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమేనని హెచ్చరికలు పంపుతోంది పార్టీ.
మహేశ్వరం టికెట్ విషయంలో రేవంత్ రెడ్డిపై నియోజకవర్గ నేత మనోహర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనకు టికెట్ దక్కుతుందని ఆశలతో కాంగ్రెస్ లో చేరిన ఈ బీఆర్ఎస్ మాజీ నేత.. కాంగ్రెస్ లోనూ తనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలిసి రేవంత్ లక్ష్యంగా ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారని.. మనోహర్ రెడ్డిని పిలిచి మాట్లాడుతారని.. షోకాజ్ నోటిసులు ఇస్తారని భావించారు. కానీ ఆ ఫార్మాలిటీస్ ను పాటించలేదు. మనోహర్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కల్గించేలా ఉన్నాయని వెంటనే ఆయనను సస్పెండ్ చేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు మనోహర్ రెడ్డిపై రంగారెడ్డి డీసీసీ అద్యక్షుడు బహిష్కరణ వేటు వేశారు.
గతంలో ఎవరైనా పార్టీ నాయకుడిని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకా ముందు ఆలోచించేవారు. వైఎస్సార్ హయంలో వెంటనే నిర్ణయాలు జరిగిపోయేవి. కానీ ఆయన మరణం తరువాత కాంగ్రెస్ పార్టీలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే నేత కరువయ్యారు. ఇప్పుడు రేవంత్ వచ్చాక పార్టీలో వేగంగా నిర్ణయాలు జరిగిపోతున్నాయి. మళ్ళీ చాలా కాలం తరువాత ఒకప్పటి కాంగ్రెస్ ను చూస్తున్నామని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. మనోహర్ రెడ్డిపై వేటు వేసి..పార్టీకి నష్టం కల్గించేలా ఎవరైనా బహిరంగంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని పీసీసీ తాజా నిర్ణయంతో సంకేతాలు పంపినట్లుగా అర్థం అవుతోంది.
Also Read : కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను మించి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో..!!