తెలంగాణలో వరుసగా కురిసిన వర్షాలతో రాష్ట్ర ప్రజానీకం ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా, హైదరాబాద్ లోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన తెలంగాణ సర్కార్ ఈ నెల 31న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వరద బాధితులను ఆదుకునే ప్రధాన ఎజెండాతో ఈ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరోవైపు చాలా రోజుల తరువాత కేబినేట్ భేటీ జరుగుతుండటంతో మంత్రివర్గ సమావేశంపై ఆసక్తి నెలకొంది.
ఎన్నికల సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో కేసీఆర్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా హామీలను ఇస్తున్నారు. గృహలక్ష్మీ పథకాన్ని జూన్, జూలై నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు నిధులు విడుదల కాలేదు. అలాగే, బీసీ బంధు, మైనార్టీ బంధులను ప్రకటించారు. కానీ నిధులు లేక అర్హులందరికీ సాయం అందటం లేదు. దీంతో ఎన్నికల నాటికీ అందరికీ లబ్ది చేకూరేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకోనున్నారు. అదే సమయంలో వరదనీటిలో చిక్కుకొని పలు గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయారు. దీంతో బాధితులను ఆదుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.
వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని కేసీఆర్ కూడా అనుకుంటున్నారు. బాధితులకు ఒక్కొక్కరికి ఎంత సాయం చేయాలి..? సర్వం కోల్పోయిన వారికీ ఎంత ఆర్థిక సాయం ప్రకటించాలి..? గ్రామాల పునరుద్దరణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై కేబినేట్ సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే,వచ్చే నెల 3నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండటంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేసీఆర్ చర్చించనున్నారు.
Also Read : బావ, బామ్మర్దులు ఫుల్ బిజీ… ఎందుకంటే..?