తెలంగాణ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఎన్నికల సంవత్సరం కావడంతో బడ్జెట్ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. రూ. మూడు లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టనుందని మీడియాకు ప్రభుత్వం లీకులు ఇస్తోంది. నిజానికి..ఈ మూడు లక్షల బడ్జెట్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలకు ఏమాత్రం సరిపోదు.. ఇది పక్కనపెడితే… ఆ మొత్తం కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారో బడ్జెట్ పద్దులో చూపించాలి.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ నిధుల సమీకరణ చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవ్వలేదు. కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు, పెండింగ్ నిధులు రాలేదు. అప్పుల ద్వారానైనా నెట్టుకొద్దామనుకుంటే అప్పులపై పరిమితి విధించింది కేంద్రం. దీంతో వచ్చే ఆర్ధిక సంవత్సరంలో నిధుల సమీకరణ తెలంగాణ సర్కార్ కు సవాల్ గా పరిణమించింది.
కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో భారీగా నిధులు సమకూరుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకోవడం ఆ తరువాత ఆ ఆశలన్నీ అడియాశలు కావడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి 59వేల కోట్లు వస్తాయని వేసుకుంటే నికరంగా వచ్చేది 24వేలకోట్లే. వచ్చే ఏడాది కూడా మరో రెండు, మూడు వేల కోట్లు పెరుగుతాయేమో కానీ పెద్దగా ఏమి పెరగవు. ఇదిలా ఉండగా.. అప్పులపై పరిమితులు తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండగా మారింది.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిరాశే ఎదురైంది. పైగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. వాటిని మంజూరు చేయాలనీ సర్కార్ కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలోనే నిధుల సర్దుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో ఇసుక వంటి వాటి రేట్ల పెంపుతో పాటు హైదరాబాద్ శివార్లలో ప్రభుత్వ భూములను వేలం వేసి పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకుంది. ఈ సారి కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ వెనకడుగు – కవిత వల్లేనా..?