తెలంగాణ బీజేపీని ప్రక్షాళన చేయాలనుకుంటుంది జాతీయ నాయకత్వం. బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని జాతీయ నేతలు స్పష్టం చేసినా కొంతమంది కీలక నేతలు ససేమీరా అనడంతో హైకమాండ్ తలొగ్గినట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అసంతృప్త నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన అగ్రనేతలు బండిని తప్పించి ఆయన స్థానంలో మధ్యే మార్గంగా సీనియర్ నేతకు అద్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని నిర్ణయించినట్లు మీడియా వర్గాలు కోడై కొస్తున్నాయి.
బండిని తప్పించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి అద్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని భావించినట్లు ఢిల్లీ బీజేపీ వర్గాలో ఉదయం నుంచి ప్రచారం జరిగింది. ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని అప్పగించి రాష్ట్రవ్యాప్తంగా ఆయన్ను పర్యటించేలా స్వేఛ్చను కల్పిస్తారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో బండిని పదవి నుంచి తప్పిస్తే ఆయనను కేంద్ర కేబినేట్ లోకి తీసుకోవాలనుకున్నారన్న వార్తలు పార్టీ వర్గాల్లో హల్చల్ చేశాయి.
మున్నూరు కాపు సామజిక వర్గానికి చెందిన బండిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆ వర్గం ఆదరణ పొందవచ్చునని పార్టీ నాయకత్వం లెక్కలు వేసుకుంది. కిషన్ కు అద్యక్ష బాధ్యతలు అప్పగించి రెడ్డి ఓటర్ల మెప్పును పొందాలని..ఈటలకు కీలకమైన ప్రచార కమిటీ చైర్మన్ ను అప్పగిస్తే ముదిరాజ్ ఓటర్లను ఆకట్టుకోవచ్చునని సామజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారని ప్రధాన స్రవంతి మీడియాలో వార్తలు వచ్చాయి.
దీంతో అద్యక్షుడి మార్పు ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మీడియాకు ముందుకు వచ్చిన కిషన్ రెడ్డి అద్యక్షుడి మార్పు వార్తలను కొట్టిపారేశారు. బండి సంజయ్ ను మార్చబోరని..సంజయ్ సారధ్యంలోనే ఎన్నికలకి వెళ్తున్నట్లు కిషన్ రెడ్డితో పాటు తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. అయితే… బండి సంజయ్ ఇంకా ఢిల్లీలోనే ఉండటంతో రెండు, మూడు రోజుల్లోనే ఎలాంటి నిర్ణయాలు వెలువడవచ్చునని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.