మునుగోడు ఉప ఎన్నికల వేళ బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది. కాంగ్రెస్ , టీఆర్ఎస్ లోని కీలక నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. తమకు అనుకూలంగా ఉండే ఛానెల్ లో పలానా నేతలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారంటూ కథనాలు ప్రసారం చేయిస్తోంది. బీజేపీ అనుబంధ సోషల్ మీడియాలో ఈ ప్రచారం వైరల్ అవుతుండటంతో ప్రత్యర్ధి పార్టీలలో కలవరం మొదలైంది.
ఇప్పటికే టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను బీజేపీలో చేర్చుకున్న కమలనాథులు…నెక్స్ట్ ఎవరన్న దానిపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా పలువురు కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన నేతలు బీజేపీలో చేరుతున్నారంటూ బట్టకాల్చి మీదేసే పనిలో బీజేపీ అనుకూల మీడియా నిమగ్నమైంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కాషాయదళంలో చేరేందుకు రెడీ అయ్యారంటూ ప్రచారం చేశారు. కనీసం ఆయన వివరణ కూడా తీసుకోకుండా ఈ తప్పుడు కథనాలను ప్రసారం చేశారు. ఈ వార్త కాస్త వైరల్ అవ్వడంతో తాను బీజేపీలో చేరుతున్నాననే వార్తలో ఎలాంటి వాస్తవం లేదని పద్మారావు గౌడ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
మునుగోడులో కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు చేసిన సర్వేలో బీజేపీకి ఎదురీత తప్పదని తేలింది. ఈ క్రమంలోనే బూర నర్సయ్యను పార్టీలో చేర్చుకొని పార్టీకి కొంత ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్డమయ్యరంటూ ప్రచారం చేసుకొని మునుగోడులో ఓటు బ్యాంక్ పెంచుకునే యోచనలో బీజేపీ నాయకత్వముంది. అందులో భాగమే ఈ బట్టకాల్చి మీదేసే ప్రయత్నం.