ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని జనసేన, టీడీపీ నేతలు చెప్తున్నారు. జగన పరిపాలనతో ఏపీ అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి చెక్ పెట్టేందుకు విపక్షాలు సిద్దం అవుతున్నాయి.
అధికార వైసీపీని గద్దె దించాలంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా కాకుండా కలిసి వెళ్ళాలనే యోచనలో జనసేన- టీడీపీలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి జనసేన ప్రధాన మద్దతుదారుగా ఉంది కాబట్టి టీడీపీ – జనసేన పొత్తుల విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయంలో ఉమ్మడిగా పోరాట కార్యాచరణ రూపొందించడానికి వీరిద్దరూ కలిసినట్లుగా చెబుతున్నారు. అయితే, వీరి భేటీ చివరి వరకు గోప్యంగానే ఉంచారు. పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఆయన చంద్రబాబుతో భేటీ కానున్నట్లు మీడియాకు తెలిసింది. అయితే వీరి భేటీలో పొత్తు చర్చలు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే టీడీపీ – జనసేనల మధ్య అవగాహనా కుదిరిందని.. నియోజకవర్గాలు కూడా ఫైనల్ చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పవన్ , చంద్రబాబుల భేటీ కీలకంగా మారింది. ఇక నుంచి ఏపీ సర్కార్ పై ఉమ్మడిగా ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే దాదాపు వచ్చే ఎన్నికల్లో కలిసి సాగుతారని క్లారిటీ వచ్చినట్లే.