మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తోన్న దోషుల విడుదలకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.
రాజీవ్ హత్యకేసులో 30ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన దోషి ఎ.జి పెరారివాళన్ ను విడుదల చేయాలని ఈ ఏడాది మే 18న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో మిగతా దోషులు కూడా తమను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. నళిని, రవిచంద్రన్, తదితరులు పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బి.ఆర్ గవాయ్ , జస్టిస్ బి. వి నాగరత్నతో కూడిన ధర్మనాసం .. ఎ.జి పెరారివాళన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పే వీరికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో మిగతా నలుగురుకి జైలు శిక్ష నుంచి విముక్తి లభించినట్టు అయింది. ఇతర కేసులు వీరిపై నమోదై లేకపోతే జైలు నుంచి వారిని విడుదల చేయాలని ఆదేశించింది.
రాజీవ్ గాంధీ హంతకుల విడుదలకు తమిళనాడు సర్కార్ తోపాటు సోనియా గాంధీ కుటుంబ సభ్యులు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కాగానే వారు జైలు నుంచి విడుదల కానున్నారు.