వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో కీలక నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణాధికారిని మార్చాలని లేదా మరో అధికారిని నియమించాలని సీబీఐని ఆదేశించింది.
వివేకా హత్య కేసులో ఇప్పటివరకు పరిణామాలను వివరిస్తూ రూపొందించిన రిపోర్ట్ ను సుప్రీంకోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. ఇందులో ఎక్కడ చూసినా రాజకీయ దురుద్దేశమే ఉన్నట్లు పేర్కొన్నారని సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలా చేస్తే నిందితులకు శిక్ష పడదన్నారు. హత్యకు దారితీసిన ప్రధాన కారణాలు దాని వెనుక ఉన్న ఉద్దేశాలను సీబీఐ బయటపెట్టాలని న్యాయస్థానం సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు ఏమాత్రం సరిగా లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
కుట్ర కోణం గురించి ఇప్పటివరకు చేసిన దర్యాప్తు ఏమాత్రం సరిగ్గా లేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసులోనున్న సూత్రాధారులు దాని వెనక కుట్ర గురించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు కోసం విచారణాదికారిని మార్చాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఈ హత్య కేసు మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ హత్యకేసును విచారిస్తోన్న రాంసింగ్ దర్యాప్తు నుంచి వైదొలిగితే కేసు మొదటికి వచ్చినట్లే. అయితే.. కేసు విచారణను స్పీడప్ చేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాలతో రాంసింగ్ ను సీబీఐ తప్పించే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.
ఈ కేసులో రాంసింగ్ ఎన్నో రాజకీయ ఒత్తిళ్ళను ఎదుర్కొన్నారు. ఆయనపై కేసులు కూడా పెట్టారు. చివరికి ఈ కేసు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తోంది. అయినప్పటికీ సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది కాబట్టి ఇక నుంచి విచారణ మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 29కి వాయిదా వేసింది.
Also Read : జగన్ లేదా అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రత్యర్ధిగా సునీత – చంద్రబాబు మాస్టర్ ప్లాన్