బిల్కిస్ బానో దోషులను పెరోల్ పై విడుదల చేయడం పట్ల గుజరాత్ సర్కార్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకోకుండా దోషులకు పెరోల్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. నేర తీవ్రతను బట్టి దోషుల పట్ల కరుణ చూపాలని తలంటింది సుప్రీంకోర్టు.
2002లో గోధ్రా అల్లర్ల సమయంలో గర్భిణి బిల్కిస్ బానోపై అత్యాచారం చేయడంతోపాటు ఆమె కుటుంబంలోని ఏడుగురిని హతమార్చిన దోషులను పెరోల్ పై గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేయగా వీటిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం.జోసెఫ్ జస్టిస్ బి.వి.నాగరత్నలలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
నేడు బిల్కిస్ బానోకు జరిగిన అన్యాయం, రేపు ఇంకెవరికైనా జరగొచ్చని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేసు తీవ్రత ఏమిటో పట్టించుకోరా? ఇలాంటి విషయాల్లో అత్యుత్సాహం ఎందుకని గుజరాత్ సర్కార్ ను కడిగిపారేసింది. దోషుల్లో ఒకరికి 1000 రోజులు, మరొకరికి 1200 రోజులు, ఇంకొకరికి 1500 రోజులు చొప్పున పెరోల్ ఇవ్వడం పట్ల ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదేమీ సాదాసీదా కేసు కాదని గుర్తు చేసింది.
దోషులకు ఎలా పెరోల్ ఇచ్చారో తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసుకు సంబంధించిన పత్రాలను తమ ముందు పూర్తిగా ఉంచాలని లేదంటే కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కేసుకు సంబంధించిన పత్రాలను చూపేందుకు సర్కార్ ఎందుకు సిగ్గు పడుతుందని గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఇలాంటి తీవ్ర నేరాల్లో దోషులకు ఊరట కల్గించే నిర్ణయాలు తీసుకునేటప్పుడు… ఆ నిర్ణయం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? అనేది తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ప్రతివాదులంతా తమ స్పందనలను మే ఒకటో తేదీలోగా దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆ మే 2కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
Also Read : కవితక్క సారా దందాలో తెలంగాణ అడబిడ్డలకు పొత్తుందా?