సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. కార్డియాక్ అరెస్ట్ తో ఆదివారం గచ్చిబౌలిలోని కాంటి నెంటల్ ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణ ఇకలేరన్న వార్తతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొనగా.. అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.
జీవిత ప్రస్థానం
1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో కృష్ణ జన్మించారు. వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు ఐదుగురు సంతానంలో కృష్ణ పెద్దవారు. సూపర్ స్టార్ పూర్తి పేరు ఘట్టమనేని శివ కృష్ణ మూర్తి. బాల్యం నుంచే కృష్ణకు సినిమాలంటే పిచ్చి. తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజినీర్ చేయాలనీ భావించారు. కాని ఇంజినీరింగ్ లో సీట్ దక్కకపోవడంతో డిగ్రీలో చేరాల్సి వచ్చింది. ఏలూరులో అక్కినేని నాగేశ్వర్ రావుకు సన్మానం జరగడం చూసి ఎలాగైనా సినిమా రంగంలో రాణించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు కృష్ణ.
1965లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. రమేష్ బాబు , మహేష్ బాబు , పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. ఆ తరువాత కృష్ణ విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు.
సూపర్ స్టార్ లేడని బాధపడాల్సిన అవసరంలే – ఆర్జీవీ ట్వీట్
సినీ ప్రస్థానం
పేరెంట్స్ కోసం ఇంజినీర్ అవ్వాలనుకున్నా సీట్ లభించకపోవడంతో సినిమాలో స్థిరపడాలని అనుకున్నారు కృష్ణ. అందుకోసం జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందిన వారు కావడంతో చెన్నై వెళ్లి వారిని కలిసి సినిమాలపై తనకున్న ఆసక్తిని చెప్పారు. కాని అప్పటికి వయస్సు తక్కువ ఉందని, కొంతకాలం అయ్యాక వస్తే సినిమా అవకాశాలు వస్తాయని చెప్పారు.అప్పటివరకు సినిమాలపై అవగాహనా పెంచుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నించారు. 1964లో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన “తేనె మనసులు” అనే సినిమాతో కృష్ణ సినీ ప్రస్థానం మొదలైంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కృష్ణ కు ఒక్కసారిగా ఫేమ్ లభించింది. అప్పటి నుంచి ఎన్నో సినిమాలు చేసి సూపర్ స్టార్ గా వెలుగొందాడు. 2016లో వచ్చిన శ్రీ శ్రీ కృష్ణ చివరి చిత్రం.
రాజకీయాలు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో కృష్ణకు మంచి పరిచయం ఉండేది. ఆయనపైనున్న అభిమానంతో కృష్ణ 1984లో కాంగ్రెస్ లో చేరారు. 1989లో కాంగ్రెస్ టికెట్ పై ఏలూరు లోక్ సభ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 1991లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో రాజకీయాలకు దూరమయ్యారు కృష్ణ.