హైదరాబాద్ నలువైపులూ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తానని సీఎం కేసీఆర్ తెగ హడావుడి చేస్తున్నారు. కేసీఆర్ ఈ హామీ ఇచ్చి కూడా దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఇంత కాలానికి ఆ హామీ శంకుస్థాపన దశ పూర్తి చేసుకుంది. ఈ నాలుగేళ్లలో ఆస్పత్రుల నిర్మాణమే పూర్తి చేయొచ్చు.. కానీ కేసీఆర్ మాత్రం చాలా కష్టపడి ఇన్నాళ్లకు శంకుస్థాపనలు మాత్రం చేశారు. ఇప్పుడు శంకుస్థాపనలు చేసిన ఆస్పత్రుల నిర్మాణమైనా సమీప భవిష్యత్‌లో పూర్తి అవుతుందా అనేది భేతాళ ప్రశ్నే. సారు గతంలోనూ వరంగల్‌లో 24 అంతస్తులతో, అత్యాధునికమైన సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తానని మహా గొప్ప హామీ ఇచ్చారు. గతేడాది మే నెలలో ఉన్నపళంగా వరంగల్ జైలు కూల్చివేసి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆస్పత్రి నిర్మాణం అధ్యయనం కోసం కెనడాకు ఒక బృందాన్ని వారంలోనే పంపుతానని గొప్పగా చెప్పారు. వరంగల్ జైలు కూల్చి వేసి కూడా ఏడాది కావొస్తోంది. కానీ ఇప్పటి వరకు వరంగల్ ఆస్పత్రి నిర్మాణానికి పిల్లర్ గుంతలు కూడా తవ్వలేదు.
గడ్డి అన్నారం మార్కెట్‌ది మరో ఘోస..
గడ్డి అన్నారం మార్కెట్ విషయంలో రైతులు, పండ్ల వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను మొదట కొహెడకు తరలిస్తున్నామంటూ మార్కెట్‌ను మూసివేశారు. ఆగమేఘాల మీద మార్కెట్ ఖాళీ చేయించి రైతులు, పండ్ల వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లను ముప్పుతిప్పలు పెట్టారు. కొహెడలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లు చిన్న గాలివానకే కూలడంతో మళ్లీ పాత చోటికే మార్చారు. ఆ తర్వాత ఏడాదికి పండ్ల మార్కెట్‌ను ఈసారి బాటసింగారం మార్చారు. అక్కడ వసతులు లేవని కొన్ని రోజులకే గడ్డిఅన్నారం మార్చారు. ఈసారి ఆస్పత్రి కడతామంటూ కొన్ని రోజులకే మళ్లీ వ్యాపారులను, రైతులను బలవంతంగా బాటసింగారం బాట పట్టించారు. అంతకుముందు గడ్డి అన్నారం మార్కెట్ స్థలంలో అతిపెద్ద బస్టాండ్ నిర్మిస్తామని తెరాస నేతలు గతంలో ప్రకటనలు ఇచ్చారు, ఇప్పుడేమో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వంలోనే ఇంత గందరగోళం ఉంది. ఇలా పలు రకాల అయోమయంలో కేసీఆర్ సర్కార్ కొట్టుమిట్టాడుతోంది.
ఇప్పటికే ఉన్న ఆస్పత్రుల్లో వసతులు కల్పించని టీఆర్‌ఎస్ సర్కార్ వేల కోట్లు వెచ్చించి ఆస్పత్రులను నిర్మిస్తామనటం నమ్మశక్యమేనా? ఉస్మానియా ఆస్పత్రిలో తరచూ పెచ్చులు ఊడిపడటం, ఓసారి సీలింగ్ ఫ్యాన్లు ఊడి డాక్టర్లు గాయపడి, వాళ్లు హెల్మెట్లు ధరించి విధులు నిర్వహించిన ఘటనలు చూశాం. ఉస్మానియా, గాంధీలో చిన్నచిన్న మరమ్మతులు చేయించలేని సర్కారు.. వేల కోట్లు పెట్టి ఆస్పత్రుల నిర్మిస్తామనటం కేవలం ఎన్నికల స్టంట్‌గా భావించవచ్చు.
భారీ ప్రకటనలు, హామీలు, శంకుస్థాపనలు తప్ప ఇటీవల కేసీఆర్ తలపెట్టిన ప్రజా సంక్షేమ పనులేవీ పూర్తయిన, ముందుకు సాగుతున్న దాఖలాలు లేవు. ఇంకా ఒక్క అడుగుపడని వరంగల్ ఆస్పత్రి దీనికి ప్రధాన ఉదాహరణ. గతంలో ఎప్పుడో ప్రకటించిన అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకజ్యోతి, మరికొన్ని ప్రాజెక్టులు నత్తకే నడకలు నేర్పేలా సాగుతున్నాయి. ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులు, ఆస్పత్రులు నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఇక్కడే కేసీఆర్ చిత్తశుద్ధిని, ఆడంబరంగా చేస్తున్న శంకుస్థాపనల అంతర్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంది.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.