పులివెందుల నియోజకవర్గం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ దక్కించుకోవడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఈ పట్టభద్రుల ఎన్నికలు టీడీపీలో కొత్త ఉత్సాహం నింపడంతో చంద్రబాబు ఇప్పుడు సాధారణ ఎన్నికలపై దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. అటు జనసేనతో పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీకి కూడా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీని ఓడించేందుకు ఏ అవకాశాన్ని వదలొద్దని చంద్రబాబు టార్గెట్ గా పెట్టుకున్నారు.
వివేకా హత్యకేసులో న్యాయపోరాటం చేసిన ఆయన కూతురు సునీతను పులివెందుల నుంచి బరిలో నిలపాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఆ మధ్య కర్నూల్ పర్యటనలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ సునీతకు మద్దతుగా నిలవాలంటూ పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆమెతో ఓసారి హైదరాబాద్ లో భేటీ అయ్యారని కూడా ప్రచారం జరిగింది. అయితే.. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి వైపు జగన్ నిలిస్తుండటంతో సునీత ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుతం జగన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పులివెందుల నుంచి టీడీపీ తరుఫున సునీతను బరిలో నిలపాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అయిన పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా అదే ఫ్యామిలీకి చెందిన సునీతను బరిలో నిలిపితే మెరుగైన ఫలితం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ప్రతిపాదన పైన ఆమె సుముఖంగా లేకపోయినా..ఆ తరువాత జరిగిన చర్చల్లో భాగంగా ఆలోచనలో కొంత మార్పు వచ్చిందని చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్ పోటీ చేయనున్నారు. ఆయన ప్రత్యర్ధిగా సునీత పోటీ చేస్తారా..? అంటే అనుమానమే. కానీ టీడీపీ మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పులివెందులలో జగన్ కు ఎంత క్రేజ్ ఉందో వివేకా కూతురు సునీతపై అంతే సానుభూతి ఉంది . ఇది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలింది. దీంతో సునీతను టీడీపీ నుంచి పోటీ చేయిస్తే పులివెందులలో మెరుగైన ఫలితం ఉంటుందని టీడీపీ భావిస్తోంది. జగన్ పై పోటీ చేసేందుకు అంగీకరించకుంటే కడప ఎంపీగా అవినాష్ రెడ్డిపై అయినా పోటీ చేయాలని సునీతను ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది.సునీతను ఎంపీగా బరిలోకి దించితే పులివెందుల నుంచి బీటెక్ రవి పోటీ చేస్తారని.. చివరి నిమిషంలో సునీత అసెంబ్లీకి అంగీకరిస్తే బీటెక్ రవికి ప్రత్యామ్నాయ సీటు వైపు ఆలోచన ఉంటుందని సమాచారం.