భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై శ్రీలంక విద్యుత్ బోర్డు ఛైర్మన్ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీలంకలో నిర్మించే విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ని భారత పారిశ్రామికవేత్త అదానీకి కట్టబెట్టేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై నరేంద్ర మోదీ ఒత్తిడి చేశారని వెల్లడించారు. ఇదే విషయాన్ని రాజపక్స స్వయంగా తనకు చెప్పారని పేర్కొన్నారు. జూన్ 10న శ్రీలంకలో జరిగిన ప్రభుత్వ సంస్థల కమిటీ ఓపెన్ హియరింగ్ లో సెలాన్ విద్యుత్ బోర్డు ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాన్డో ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో ట్విటర్లో బాగా వైరల్ అవుతోంది.
వీడియోలోని వివరాలు ఇలా ఉన్నాయి. “గతేడాది నవంబర్ 24న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సతో నేను భేటీ అయిన సమయంలో.. మన్నార్ జిల్లాలో నిర్మించే విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ని అదానీ గ్రూప్ కి ఇవ్వాలని భారత ప్రధాని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. అయితే ఈ విషయంతో తనకు కానీ, విద్యుత్ బోర్డుకి కానీ సంబంధం లేదని నేను స్పష్టం చేశాను. విషయాన్ని పరిశీలించాలని రాజపక్స సూచించారు. ఆ తర్వాత నేను ఆర్థిక శాఖ సెక్రెటరీకి లేఖ రాశాను. ఇది రెండు దేశాల ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఒప్పందంగా పరిగణించాలని పేర్కొన్నాను.” అని ఫెర్డినాన్డో ఓపెన్ హియరింగ్ లో తెలిపారు.
ఎన్డీటీవీ వెల్లడించిన ఈ సంచలన వివరాల ప్రకారం.. శ్రీలంకలోని మన్నార్ జిల్లాలో 500 మెగావాట్ల సోలార్, పవన్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో భారత ప్రభుత్వం పరోక్షంగా అదానీ గ్రూప్ కి లబ్ది చేసేందుకు ప్రయత్నించింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఫెర్డినాన్డో గతేడాది నవంబర్ లో శ్రీలంక ఆర్థిక మంత్రిత్వశాఖ సెక్రెటరీకి రాసిన లేఖని ఎన్టీటీవీ సంపాదించింది. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ నెలలో శ్రీలంకలో 500 మిలియన్ డాలర్ల విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ని అదానీ గ్రూప్ దక్కించుకుంది.
ఫెర్డినాన్డో వెల్లడించిన వివరాలపై వివరణ కోరేందుకు ఎన్డీటీవీ ప్రయత్నించింది. అయితే అటు అదానీ గ్రూప్ నుంచి కానీ, భారత ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సమాధానం రాలేదని ఎన్డీటీవీ తెలిపింది. అయితే.. ప్రధాని మోదీపై ఆరోపణలు చేసిన మరుసటి రోజు విద్యుత్ ఛైర్మన్ బోర్డు ఫెర్డినాన్డో పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే మాట కూడా మార్చారు. తాను భావోద్వేగంలో అలా మాట్లాడానని ట్వీట్ చేశారు. మరోవైపు ఫెర్డినాన్డో ఆరోపణలను శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఖండించారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. అదానీ గ్రూప్ కి 500 మిలియన్ డాలర్ల ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కడం.. శ్రీలంక ప్రభుత్వం ఇటీవలే విద్యుత్ ప్రాజెక్టు టెండర్ల అంశంలో కాంపటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని తొలగించడం… ఆ తర్వాత కీలక స్థాయి అధికారి భారత ప్రభుత్వం కాంట్రాక్ట్ అప్పజెప్పడంలో ఒత్తిడి చేసిందని ఆరోపణలు చేయడం.. వెంటనే ఆ అధికారి రాజీనామా చేయడం… ! ఈ మొత్తం తతంగంపై మోడీ ప్రభుత్వం భారత ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.