నార్సింగ్ శ్రీచైతన్య కాలేజ్ లో సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్యకు కారణం కాలేజ్ యాజమాన్యమే. కాలేజ్ యాజమాన్యం తీవ్రంగా కొట్టడం..అవమానించేలా కామెంట్స్ చేయడమే సాత్విక్ మరణానికి కారణమని తెలుస్తోంది.
వాస్తవానికి సాత్విక్ చదువులో బాగా క్లెవర్. పదో తరగతిలో 9ప్లస్ జీపీఏ వచ్చింది. చదువులో చురుకైన విద్యార్ధి కావడంతో అతని శ్రీచైతన్యలో జాయిన్ చేశారు. మొదట్లో పాఠాలు అర్థం కాకపోవడంతో చదువులో కొంచెం వెనకబటడంతో అధ్యాపకులు వేధించారు. తీవ్రంగా కొట్టారు. దాంతో 15రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తరువాత కోలుకున్నాక కాలేజ్ కు వెళ్లేందుకు మారం చేశాడు సాత్విక్. ఏ కాలేజ్ కైనా వెళ్తాను కానీ శ్రీచైతన్య కాలేజ్ కు మాత్రం వెళ్ళనమ్మా అని..తల్లి కాళ్ళవెల్ల పడ్డాడు. కానీ కొడుకు భవిష్యత్ బాగుండాలని అతనికి సర్దిచెప్పి కాలేజ్ కు పంపారు. ఇక నుంచి తమ కొడుకును కొట్టకండని అధ్యాపకులకు చెప్పి వెళ్ళారు కానీ శ్రీచైతన్య యాజమాన్యం ఆ తల్లిదండ్రులను మాట పెడచెవిన పెట్టింది. సాత్విక్ ఫెయిల్ అయితే కాలేజ్ కు చెడ్డ పేరు వస్తుందనుకొని అతని మళ్ళీ చావబాదారు.
మార్కులు తక్కువ ఎలా వస్తాయని సాత్విక్ కు మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చారు. రక్తం కారేలా కొట్టారు. నీ కాల్మొక్తా సార్ అని కాళ్ళవెళ్ళాపడిన వినకుండా పాశవికంగా కొట్టారు. శ్రీ చైతన్య కాలేజ్ లో ఎలాంటి భయంకర పరిస్థితులు ఉంటాయో కొంతమంది విద్యార్థులు ఆ మధ్య వీడియోలు తీసి బయటపెట్టారు. అయినప్పటికీ మన విద్యాశాఖ మొద్దునిద్రలోనే జోగుతుంది తప్ప మల్లెపువ్వలాంటి పసిమొగ్గలను రాల్చుతున్న శ్రీచైతన్యపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే.. అధికారపార్టీకి శ్రీచైతన్య, నారాయణ లాంటి కార్పోరేట్ విద్యా సంస్థలు విరాళాలు ఇస్తాయి కదా. అందుకే ఎంతమంది అమాయక పిల్లలు శ్రీచైతన్య , నారాయణ దాష్టీకాలకు రాలిపోతున్నా ప్రభుత్వాలకు మనస్సు కరగడం లేదు. ఇకపోతే, శ్రీ చైతన్య క్యాంపస్ లోకి తల్లిదండ్రులకు ప్రవేశం ఉండదు. కేవలం సంవత్సరానికి మూడుసార్లు మాత్రమే వారికి వచ్చే అవకాశం కల్పిస్తారు.. తమ పిల్లలు అనారోగ్యానికి గురైనా సరైన సమాచారం ఇవ్వరు. అదో బందీఖానా.
ఇక.. సాత్విక్ విషయంలో కాలేజ్ యాజమాన్యం వ్యవహరించిన తీరు అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది . మార్కులు తక్కువ వస్తున్నాయని అతడికి మధ్యాహ్నం అన్నం కూడా మానేసి దుర్మార్గంగా ప్రవర్తించారు. ఫీజ్ చెల్లింపు ఆలస్యమైతే మండుటెండలో నిల్చోబెట్టారు. కర్రలతో కొడితే శరీరం వాతలు వచ్చింది. సాత్విక్ ఆత్మహత్య చేసుకునే ముందు రోజు కూడా అధ్యాపకులు తీవ్రంగా కొట్టారు. బట్టలు అరెసుకునే తాడుతో ఉరేసుకొని చనిపోయాడు. సాత్విక్ చనిపోయినప్పటికీ కనీసం ఈ విషయాన్ని అతడి తల్లిదండ్రులకు చెప్పేందుకు కూడా యాజమాన్యం నిరాకరించిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల పాలిట మృత్యుకుహారాలుగా మారిన కార్పొరేట్ కాలేజీ లపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఇదంతా జరుగుతోంది.