తెలంగాణ ఆర్ధిక పరిస్థితి గందరగోళంగా ఉంది. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలకు నిధుల కటకట కొనసాగుతోంది. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను చెల్లించకపోవడంతోనే ఈ సమస్య వస్తుందని కేసీఆర్ చెప్పదల్చుకున్నట్టున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ విదిస్తోన్న అంక్షల వలన 2022-23ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణకు రావాల్సిన ఆదాయంలో 40వేల కోట్లు తగ్గుదల చోటు చేసుకుందని కేసీఆర్ అంచనాకు వచ్చారు. ఈ అంశాన్ని జనాల్లో చర్చకు పెట్టాలని డిసెంబర్ లో వారం వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అయితే , 40వేల కోట్లను ఆదాయంగా కేసీఆర్ పైకి చెబుతున్నారు కాని అవన్నీ రుణాలు. అప్పులను తీసుకోకుండా తెలంగాణపై కేంద్రం ఆంక్షలు విధించడంతో రాష్ట్రాన్ని నిధుల సమస్య వేధిస్తోంది కాబట్టి, ఆ 40వేల కోట్లను ఆదాయంగా చెబుతున్నారు కేసీఆర్.
కార్పొరేషన్ ల ద్వారా ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చెసిందని…వాటిని కూడా రాష్ట్ర అప్పులుగా చూస్తామని కేంద్రం చెప్పింది. మీరెలా అప్పులు తీసుకుంటున్నారో మేం కూడా నిబంధనలకు అనుగుణంగానే అప్పులు చేస్తున్నామని తెలంగాణ చెబుతోంది. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వెంటనే రుణాలు పొందేందుకు తెలంగాణకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుండగా అందుకు కేంద్రం నిరాకరిస్తోంది. దాంతో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు కల్గిస్తోందని ప్రజలకు కేసీఆర్ వివరించనున్నారు.
అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఖరారు కాకపోయినా…కేసీఆర్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు మొగ్గు చూపడం పలు అనుమానాలకు కారణం అవుతోంది. కేంద్రం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూల్చాలని ప్రయత్నిస్తోందని అసెంబ్లీ వేదికగా చెప్పేసి సానుభూతిని రగిల్చి ముందస్తుకు కేసీఆర్ వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.