వందేళ్లుగా కలిసి జీవిస్తున్న ప్రజల మధ్య మరో వందేళ్లు కలవలేని శత్రుత్వాన్ని మణిపూర్ వాసుల్లో నూరిపోసింది ఎవరు..? అక్కడి ప్రజల మధ్య అనుబంధాలను కత్తిరించిన కాలకేయులు ఎవరు..?పాలిచ్చిన అమ్మల రొమ్ములను బరితెగించి ఊరేగించిన ఉన్మాదానికి ప్రేరేపించిన శక్తులు ఏవి..? మూడున్నర నెలలుగా మణిపూర్ యుద్దకాండగా మారడంపై దేశవ్యాప్తంగా ప్రజల మధ్య జరుగుతున్న చర్చ ఇది.
మణిపూర్ లో ఇద్దరు మహిళలపై ఆకృత్యానికి పాల్పడటానికి కారణం… రాజకీయ పార్టీలు పెంచిన పోషించిన కులం, మతం, వర్గం, ప్రాంతం. ఇవే మణిపూర్ ను మానని గాయంలా మార్చాయి. ప్రజల మధ్య చిచ్చును రాజేశాయి. మణిపూర్ ను రెండు వర్గాలుగా చీల్చాయి. ప్రజల మధ్య ఐక్యత నింపాల్సిన పాలకులు ఇవన్నీ కామన్ అని మాట్లాడుతుండటం వారి ఎజెండాను బయటపెడుతున్నాయి. స్వయంగా మణిపూర్ ముఖ్యమంత్రే.. మా మణిపూర్ లో ఇలాంటి ఘటనలు వందలసార్లు జరిగాయని వ్యాఖ్యానించాడంటే…మణిపూర్ మంటల వెనక రాజకీయ నేతల ప్రమేయం లేదని ఎలా అనుకోవాలన్న ప్రశ్న కలగకమానుతుందా..? ప్రజలు ఆలోచించాలి.
మణిపూర్ లో రెండు వర్గాల మధ్య చెలరేగిన హింస ఇంకా కంటిన్యూ అవుతోంది. మూడున్నర నెలలుగా ఈ పరిస్థితిలో మార్పు లేదు. మైతేయి, కుకీ తెగల మధ్య రాజుకున్న హింసలో 200మంది ప్రాణాలు కోల్పోయారు. 400మంది గాయపడ్డారు. 60వేల మంది శరణార్థులుగా మారారు. ఎప్పుడు ఎలాంటి ఉత్పాతం చోటుచేసుకుంటుందో తెలియదు. రెండు వర్గాలు ఒకరిని లక్ష్యంగా చేసుకొని ఒకరు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఆత్మీయతకు అద్దంపట్టిన మణిపూర్ తెగల మధ్య ఇప్పుడు విద్వేషం సుడులు తిరగడానికి ప్రధాన కారణం బీజేపీనే.
దేశ స్వతంత్ర అనంతరం క్రైస్తవాన్ని పాటించే కుకి వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చారు. మైతేయి తెగలలో హిందువులు ఎక్కువ..వారికి రిజర్వేషన్లు లేవు. కుకీలకు ప్రత్యేకంగా కొన్ని హక్కులు లభించాయి. కుకీలున్న ప్రాంతాల్లో మైతేయిలు భూములను కొనలేరు. అయితే, మణిపూర్ లో మైతేయిల ఓటు బ్యాంక్ అధికంగా ఉంటుంది…రాజకీయంగా ప్రాబల్యం కల్గిన వారు కూడా. దీనిని ఆసరాగా చేసుకున్న బీజేపీ… ఇటీవలి ఎన్నికల్లో మెజార్టీలైన మైతేయిలను ఎస్టీలో చేరుస్తామని హామీ ఇచ్చింది. మైతేయిలకు రిజర్వేషన్లు అందితే తాము నష్టపోతామని ఎస్టీ వర్గాల ఆందోళన. ఫలితంగా కుకీలకు, ఇతర గిరిజన జాతులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. మైతేయిలు ఉద్యమాన్ని ప్రతిఘటిస్తూ కుకీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. వారికి మద్దతుగా పలు విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగడంతో ఉద్యమం హింసాత్మక రూపం తీసుకున్నది.
మణిపూర్ లో అధికారం హస్తగతం చేసుకోవాలన్న బీజేపీ ఆకాంక్ష అక్కడి ప్రజల మధ్య చీలికకు కారణమైంది. బీజేపీ లక్ష్యం నెరవేరింది కానీ రెండు చీలిన ప్రజల మధ్య సయోధ్య కుదుర్చుట ఎలా అంశంపై మాత్రం బీజేపీ అసలే పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చోటుచేసుకున్న చిన్న, చితక అల్లర్లను చూపి “మణిపూర్ లో శాంతి స్థాపన చేయని వారికి మణిపూర్ ని పాలించే హక్కు లేదని ప్రధాని మోదీ అన్నాడు. ఇప్పుడు ఇంత విధ్వంసం, హత్యలు, హత్యాచారాలు, ఒక జాతి హననం తమ పార్టీ ప్రభుత్వ హయాంలో జరుగుతుంటే మణిపూర్ వైపే చూడటం లేదు. మణిపూర్ గురించి మాట్లాడటం లేదు. బీజేపీ అనేది అధికారంలో లేకపోతే చిన్న నిట్టూర్పుని పెనుకేకగా ప్రచారం చేయగలదు. చావుకేకల్ని విననట్టూ ఉండగలదు. బీజేపీ ఓడించడం దేశానికి, దేశ ప్రజలకు తక్షణ అవసరం.
Also Read : కేసీఆర్ విమర్శలే బీజేపీకి బలమా..?