తెలుగు రాష్ట్రాల్లో రెండు కేసులు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఏపీలో వివేకా హత్య కేసు..తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ రెండు కేసులు ఒకదానితో మరొకటి సంబంధం లేకపోయినా ఓ సారూప్యత మాత్రం ఉంది. అదేంటో ఈ కథనంలో చూద్దాం.
వివేకా హత్యకేసులో తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఏపీ అధికార పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణలోని అధికార పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినాష్ రెడ్డి ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. వరుసకు తమ్ముడు అవుతాడు. కాగ, కవిత తెలంగాణ సీఎం కేసీఆర్ గారాలపట్టి. కేటీఆర్ కంటే కూడా కవితకు కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తాడని అంటుంటారు.
వివేకా హత్య కేసుని తీసుకోండి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును తీసుకోండి. ఈ రెండు విషయాలు తెరమీదకు వచ్చినప్పుడు అటు అవినాష్ రెడ్డికాని ఇటు కవిత కాని ఎవరు బయటపడలేదు. ఎక్కడ వీరి పేర్లు వినిపించలేదు. వివేకా కేసులో సీబీఐ దూకుడు పెంచడంతో అవినాష్ రెడ్డి పేరు బయటకు రాగా…లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచడంతో కవిత పేరు బయటపడింది. వీరిద్దరి పేర్లు మధ్యలోనే తెరమీదకు వచ్చాయి.
Also Read : అవినాష్ రెడ్డికి హైకోర్టు షాక్ – అరెస్ట్ కు లైన్ క్లియర్
ఈ రెండు కేసులో దర్యాప్తు చేస్తున్నవి కేంద్ర దర్యాప్తు సంస్థలే. ఈ కేసులు బయటకు వచ్చాక కొంతమందిని విచారించాక కొన్నాళ్ళ తరువాత వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డికి , ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు నోటిసులు ఇచ్చారు. ఆయా కేసులో నోటిసులు ఇచ్చిన వెంటనే వీరిద్దరూ విచారణకు హాజరు కాలేదు. విచారణకు తాము ఇప్పుడు రాలేమని కొంత సమయం పడుతుందని వాయిదా కోరినవారే.
ఇటీవల విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి మరియు కవితలు కేంద్ర దర్యాప్తు సంస్థలపైనే సంచలన ఆరోపణలు చేశారు. కేసులో నిజనిజాలను తెలుసుకోకుండా వ్యక్తి టార్గెటెడ్ గా విచారణ చేస్తున్నారని సీబీఐ మీద అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తే.. లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీపై కవిత ఆరోపణలు చేసింది. ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోందని సంచలన ఆరోపణలు చేసింది. తమ పాత్ర లేకపోయినా రాజకీయ కక్షలో భాగంగా వేధిస్తున్నారని ఇద్దరు వేర్వేరు కేసులో ఒకే వర్షన్ ను వినిపిస్తున్నారు.
Also Read : పులివెందులలో వైసీపీకి ప్రమాదఘంటికలు..!
లిక్కర్ స్కామ్ లో సాక్ష్యాలను ధ్వంసం చేసిందని కవితపై ఆరోపణలు వస్తుండగా..వివేకా హత్య సందర్భంగా సాక్ష్యాలను అవినాష్ రెడ్డి మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఉన్న కవిత.. తాను ఉపయోగించే స్మార్ట్ ఫోన్లను పెద్ద ఎత్తున ధ్వంసం చేశారని.. తద్వారా ఆధారాల్ని చిక్కకుండా ఉండేలా ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక అవినాష్ రెడ్డి విషయానికి వస్తే వివేకా హత్య అనంతరం రక్తపు మరకలను తుడిచేశారని అవినాష్ రెడ్డిపై బలమైన ఆరోపణలు ఉన్నాయి.
చివరగా ఇద్దరూ అరెస్టు అవుతామనే భయంతోనే ఉన్నారు. వీరిని విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు వీరిని త్వరలోనే అరెస్టు చేయొచ్చన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
Also Read : టీఎస్ పీస్సీ పేపర్ లీకేజీలోనూ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం..?