కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ లో జరుగుతోన్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో కొత్త మార్పు కనిపిస్తుందన్న సోనియా గాంధీ… దేశానికి ఇక మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతోనే తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 100ఏళ్ల చరిత్ర కల్గిన పార్టీకి నేతృత్వం వహించే అవకాశం దక్కడం గర్వంగా భావిస్తున్నానని భావోద్వేగంతో ప్రసంగించారు. భారత్ జోడో యాత్ర తరువాత తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగించటం సంతోషం అని తెలిపారు.
కాంగ్రెస్ కు, దేశానికి కూడా 2024 ఎన్నికలు పరీక్షలాంటివి అని సోనియా గాంధీ అన్నారు. అదే సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఏపికి ఇచ్చిన ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని కీలక ప్రకటన చేశారు. రాయ్పూర్ లో జరుగుతున్న ఏఐసిసి ప్లీనరి సందర్భంగా సోనియా రిటైర్మెంట్ ప్రకటన కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సోనియా ప్రకటన చూస్తే జోడోయాత్రతో రాహుల్ సంపూర్ణ నాయకుడిగా ఎదిగాడని ఆమె భావిస్తోంది. అందుకే ఇక తాను రాజకీయాల నుంచి తప్పుకొని కొడుకుపై భారం వేసినట్టుగా అర్థమవుతోంది.