టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై సంచలన ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటిసులు జారీ చేసింది. పేపర్ లీక్ కేసులో మీ దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించాలని రేవంత్ కు ఇచ్చిన నోటిసుల్లో పేర్కొన్నారు. నిరుద్యోగ నిరసన దీక్షలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… పేపర్ లీకేజీ వెనక మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్ర ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఆధారాలను అందించాలని రేవంత్ కు సిట్ నోటిసులు ఇచ్చింది.
ఒకే మండలంలో వందమందికి ర్యాంకులు ఎలా వచ్చాయని.. దీనికి కారణం పేపర్ లీకేజీనేనని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ పేషి నుంచే పేపర్ లీకేజీ జరిగిందన్నారు. దీంతో మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, వివరాలను అందజేయాలని సిట్ ఏసీపీ నోటిసులు ఇచ్చారు. బండి సంజయ్ కూడా ఇదే రకమైన ఆరోపణలు చేసి ఉన్నారు. దీంతో ఆయన కూడా సిట్ నోటిసులు ఇచ్చే అవకాశం ఉంది.
అయితే.. సిట్ నోటిసులపై రేవంత్ స్పందించారు. నోటిసులకు తాను భయపడేది లేదన్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్ కు ఇవ్వబోనని…తాము డిమాండ్ చేస్తున్నట్లుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే ఆధారాలు ఇస్తానని స్పష్టం చేశారు.