తెలంగాణ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించాలని ఉవ్విళ్ళురుతుంటే, ఇక తెలంగాణ ఇచ్చామన్న సెంటిమెంట్ తో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకుంటోంది. బీజేపీ కూడా తామేమి తక్కువ కాదని పోటీనిచ్చే స్థాయిలో రాజకీయం చేస్తోంది. ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయమే ఉండగా ఆయా సంస్థలు, మీడియా యాజమాన్యాలు తెలంగాణలో గెలుపు ఎవరనే అంశంపై సర్వేలు చేపడుతున్నాయి. తాజాగా సిగ్నిచర్ స్టూడియో చానెల్ సర్వే చేసింది.
ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి..
సిగ్నిచర్ స్టూడియో చేపట్టిన సర్వేలో కాంగ్రెస్ కు మెజార్టీ స్థానాలు వస్తాయని తేలింది. 58సీట్లతో మొదటి స్థానంలో నిలిచి, అధికారంలోకి వచ్చేందుకు మరో రెండు సీట్ల దూరంలో నిలుస్తుందని తేల్చింది. తెలంగాణలో ఏదైనా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్లు 60. అంటే రెండు సీట్ల దూరంలో కాంగ్రెస్ నిలుస్తుందని సర్వేలో వెల్లడి అయింది. ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమి కాదని అర్థం అవుతోంది.
అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీగా
అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకున్న బీఆర్ఎస్ కు ఆశాభంగమే ఎదురు కానున్నట్లు తేలింది. బీఆర్‌ఎస్ కేవలం 31 సీట్లకు పరిమితమవుతుందని సిగ్నిచర్ స్టూడియో సర్వేలో వెల్లడి అయింది. ఈ 31స్థానాల్లో కూడా బొటాబొటీ మెజార్టీతో నేతలు విజయం సాధిస్తారని పేర్కొంది. సగానికి సగం మంది మంత్రులు ఓడిపోవడం ఖాయమని సర్వేలో తేలినట్లు పేర్కొంది.
ప్రత్యామ్నాయమని చెప్పిన బీజేపీ
తెలంగాణపై అగ్రనేతలు ప్రధానంగా ఫోకస్ చేసినా ఫలితం ఉండదని స్పష్టం చేసింది సిగ్నిచర్ స్టూడియో. బీజేపీకి 25సీట్లు వస్తాయని అంతేకాని అధికారంలోకి వచ్చే స్థాయిలో సీట్లు దక్కవని తేలింది. ఎంఐఎం తన స్థానాలకు తిరిగి గెలుచుకుంటుందని పేర్కొంది.