తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వారసులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకోవాలని తెగప్రయత్నం చేస్తున్నారు. వయోభారం, అనారోగ్యం దృష్ట్యా తమ వారసులను రాజకీయ అరంగేట్రం చేయించాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు మరో ఏడు నెలల సమయం ఉండగానే నియోజకవర్గ పర్యటనలు చేయిస్తూ ప్రజలతో మమేకం కావాలని సూచిస్తున్నారు.
ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన వారసుడిని వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ నుంచి బరిలో నిలపాలని యోచిస్తున్నారు. ఆయన కుమారుడు నియోజకవర్గంలో పర్యటనలు కూడా చేస్తున్నారు. కానీ పోచారంను కేసీఆర్ నిరాశపరిచారు. నేను ముసలోడిని అవుతున్నా..పోచారం కూడా అవుతున్నాడు. అయినప్పటికీ నేను ఉన్నంత కాలం పోచారం ఎమ్మెల్యేగా ఉండాలని ఇటీవలి సభలో కేసీఆర్ ప్రకటించారు. కారణం.. ఆయన వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటారని తెలియడంతో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు.
భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఈ ప్రకటన చేయడం కొత్త చర్చకు దారితీస్తోంది. పార్టీలో వారసులకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించాలనుకోవడం లేదని కేసీఆర్ ప్రకటనతో తేలింది. ఒక్క పోచారమే కాదు…బీఆర్ఎస్ లో చాలా మంది నేతలు వారసుల ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , మల్లారెడ్డి వచ్చే ఎన్నికల్లో తనయులను బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన తనయుడిని వచ్చే ఎన్నికల్లో రాజేంద్ర నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కూడా తన ఇద్దరు తనయులు భద్రారెడ్డి, మహేందర్ రెడ్డిలకు రాజకీయ భవిష్యత్ ను కల్పించాలని వ్యూహాలను రచిస్తున్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తన కుమారిడిని ఇబ్రహీంపట్నంలో పాదయాత్ర చేయిస్తున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు తన కుమారిడిని అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలపాలని అనుకుంటున్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు తన తనయుడు రోహిత్ రావు ను మెదక్ అసెంబ్లీ నుంచి బరిలోకి దింపాలనుకుంటున్నారు. కానీ పార్టీలో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. పైగా సిట్టింగ్ లకే టికెట్లు అని కేసీఆర్ ప్రకటించడంతో తమ వారసులకు ఇప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రానట్టేనని సీనియర్ నేతలు ఓ అవహగనకు వస్తున్నారు. ఈసారి ఎన్నికలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుండటంతో వారసుల జోలికి పోవద్దని అనుకుంటున్నారు.
Also Read : బీజేపీ ఏజెంట్ కేసీఆర్ – స్టాలిన్ గుర్తించే కేసీఆర్ ను పక్కన పెట్టారా..?