ఇక తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు మారేలా లేరు. టీపీసీసీ అద్యక్షుడిగా రేవంత్ ఏం నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించడమే సీనియర్ల పని అయిపొయింది. అధిష్టానం దగ్గర రేవంత్ పరపతి పెరుగుతుందని టీపీసీసీ జంబో కమిటీ తేల్చడంతో అసంతృప్త రాగాలను ఆలస్యం లేకుండా వినిపించేశారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెబుతూనే తెరవెనక సీనియర్ నేతలు కత్తులు నూరుతున్నారు.
రేవంత్ పై నిత్య అసంతృప్తి రాగాలను వినిపించే నేతలంతా మరోసారి భేటీ అయ్యారు. ఇందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసం వేదికైంది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి,ఏలేటి మహేశ్వర్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ప్రేమ్ సాగర్ రావులు సమావేశమయ్యారు. కొత్తగా ప్రకటించిన టీసీసీ కమిటీలో తమ వర్గానికి చెందిన నాయకులకు చోటు దక్కలేదన్నది సీనియర్ నేతల అసంతృప్తి. టీడీపీ నుంచి వచ్చిన వారికే నూతన కమిటీలో చోటు కల్పించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరిన తరువాత కూడా వారిని టీడీపీ నేతలుగా ఎలా పరిగణిస్తారో ఉత్తమ్ సార్ కే తెలియాలి.
ఇక నుంచి కాంగ్రెస్ ను కాపాడుకునేందుకు సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్తామని భట్టి ప్రకటించారు. ఇన్నాళ్ళు కాంగ్రెస్ లో సీనియర్ నేతగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగిన సమయంలో పార్టీని ఎమ్మెల్యేలు వరుసగా వీడుతున్నప్పుడు ఒక అడుగు కూడా ముందుకు వేయని భట్టి ఇప్పుడు సేవ్ కాంగ్రెస్ నినాదం ఎత్తుకోవడం హాస్యాస్పదమే. అందరం కలిసి పార్టీని కాపాడుకోవాలని నిర్ణయించుకుమన్నారు. అది ఎలాగంటే.. పార్టీపైనే పోరాటం చేయడం ద్వారా అన్నట్లు ఆయన ప్రకటన ఉంది.
నాలుగు పార్టీలు మారిన వ్యక్తి పార్టీని ఉద్దరిస్తాడా..? అని మాట్లాడుతోన్న ఉత్తమ్.. ఆయన పీసీసీ చీఫ్ గా ఉన్నపుడే రేవంత్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. అప్పుడు వ్యతిరేకించని నేత ఇప్పుడు వ్యతిరేకించడం ఏంటో. ఒక్కో సీనియర్ నేత ఒక్కో విధంగా రేవంత్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిని పీసీసీ పీఠంపై నుంచి లేపేయాలన్నది సీనియర్ల ప్లాన్. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పీసీసీ కమిటీలో రేవంత్ వర్గానికి చోటు కల్పించారని ఆరోపిస్తూ అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు.
సీనియర్ల నేతల తీరు మారకపోవడంతోనే చాలామంది నేతలు బీజేపీ వైపు తొంగి చూస్తున్నారు. ఈ విషయం మాత్రం సీనియర్లకు ఎక్కడం లేదు. ఇది ఇలాగె కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ మరింత మునగడం ఖాయం.