ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ – కశ్మీర్ లో తాత్కాలికంగా నిలిచిపోయింది. భద్రత లోపాల వలన జన సమూహాలను నియంత్రించడంలో స్థానిక యంత్రాంగం విఫలం కావడమే ఇందుకు కారణం. రాహుల్ గాంధీ కూడా ఇదే విషయం చెప్పారు. తన భద్రత సిబ్బంది సూచనల మేరకు నేటి పాదయాత్రను విరమించుకున్నానని వెల్లడించారు. కశ్మీర్ లోయకు ప్రవేశద్వారమైన ఖజీగుండ్ సమీపంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
బనిహాల్ టన్నెల్ దాటి ఖజీగుండ్ కు చేరుకున్న రాహుల్ గాంధీ.. షెడ్యూల్ మేరకు సౌత్ కశ్మీర్ లోని వెస్సు వైపు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. కాని అంతలోనే బాహ్య భద్రత వలయాన్ని నిర్వహించాల్సిన పోలీసులు ఎస్కేప్ అయ్యారు. దీంతో భారీ జన సమూహాలను నియత్రించే వారు లేకపోవడంతో రాహుల్ భద్రత సిబ్బంది యాత్రను విరమించుకోవాలని సూచించారు. చేసేదేం లేక రాహుల్ తాత్కాలికంగా యాత్రను విరమించుకుంటున్నట్లు వెల్లడించారు.
శుక్రవారం 11కి. మీ మేర పాదయాత్ర చేయాల్సి ఉండగా..కిలో మీటర్ లోపే పాదయాత్రను నిలిపివేయాల్సి వచ్చింది. భద్రత కల్పించాల్సిన స్థానిక పోలీసులు సడెన్ గా అదృశ్యం కావడంతో రాహుల్ గాంధీ అర్దగంటపాటు ఎటు కదలలేకపోయారు. యాత్రకు సెక్యూరిటీ కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. యాత్ర ముగింపుకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో కుట్రలు చేస్తున్నారని అంటున్నారు.