బీఆర్ఎస్ లో ముసలం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పార్టీని అన్ని తానై నడిపిస్తోన్న కేసీఆర్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సమయం చూసి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
బీజేపీ – బీఆర్ఎస్ ల మధ్య రాజకీయం పతాకస్థాయికి చేరుకోవడంతో ఈడీ, సీబీఐలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిట్ తో బీఆర్ఎస్, ఈడీ తో బీజేపీ, ప్రత్యర్ధి పార్టీలకు ఉచ్చు బిగించేందుకు ట్రై చేస్తున్నాయి. ఈ రాజకీయంలో తామెక్కడ బుక్ అవుతామోనని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. మంత్రులు తలసాని, గంగుల, మల్లారెడ్డి ఇల్లు, ఆస్తులపై కేంద్ర దర్యాప్తు అధికారులు దాడులు చేశారు. పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటిసులు ఇచ్చింది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈడీ రాడార్ లో ఉన్నారని ఆందోళన చెందుతున్నారు.
Also Read : కాంగ్రెస్ పై కోవర్ట్ ఆపరేషన్ – రంగంలోకి ఎర్రబెల్లి
కేసీఆర్ వ్యక్తిగత రాజకీయ ఎజెండాలో తామెందుకు బలికావాలని ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. దాంతో తమ దారి తాము చూసుకోవడం మంచిదన్న ఆలోచనతో ఉన్నారు. ఈ వార్తలు ఇలా కొనసాగుతుండగానే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో జరిగిన ఈ భేటీకి ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ లు హాజరయ్యారు. నియోజకవర్గ సమస్యలపైనే భేటీ అని ఈ నేతలు చెబుతుండగా, ఓ మంత్రికి వ్యతిరేకంగా వీరంతా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ లో నూతన కమిటీపై కొండా సురేఖ రాజీనామాతో సాగిన అసంతృప్తి పార్టీని రెండుగా చీల్చినట్లుగా…టీఆర్ఎస్ లోనూ అదే పరిస్థితి నెలకొంటుందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీపై చాలామంది ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికల నాటికీ అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.