తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఐదు వేల చొప్పున రెండు విడతల్లో రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులను జమ చేస్తోంది. ఇప్పటివరకు యాసంగి సీజన్ లో 15ఎకరాల లోపున్న రైతులకు మాత్రమే సర్కార్ సాయం అందింది. కొన్ని చోట్ల 12ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమ అయ్యాయి. ఆపై ఉన్న రైతులకు ఇంకా పెట్టుబడి సాయం అందలేదు. ఇలా 15ఎకరాలకు పైగా భూమి ఉన్న వారిలో అధికార పార్టీ నేతలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారంతా సామాన్య రైతుల మాదిరి రైతు బంధు డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు.
అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేతకు దాదాపు యాభై ఎకరాల భూమి ఉంది. ఆయన భార్య పేరు మీద 25 ఎకరాలు, ఆయన కుమారుడి పేరు మీద 20ఎకరాలు, తండ్రి పేరు మీద 18ఎకరాల ఎకరాల భూమి ఉంది. సర్కార్ ఇచ్చే రైతు బంధు ద్వారా ఆ కుటుంబానికి దాదాపు 11 లక్షల వరకు చేరుతుంది. ఓ మంత్రి కుటుంబానికి ప్రతి సంవత్సరం 9లక్షలు , మరో మంత్రి కుటుంబానికి 7లక్షలు. ఇలా అధికార పార్టీలోని లీడర్లు రైతు బంధు సాయం ద్వారా ఏటా లక్షల రూపాయలను వెనకేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది సాయం ఇంకా అందకపోవడంతో వారంతా తమకొచ్చే లక్షల రూపాయలు ఇంకా అందలేదని ఎదురుచూస్తున్నారు.
రైతు బంధుపై విమర్శలు వచ్చాయి. ఇది భూస్వాముల కోసం తీసుకొచ్చిన పథకమేనని… సామాన్య రైతులకు సర్కార్ ఇచ్చే సాయం ఏమూలకు సరిపోదని పెదవివిరుపులు వినిపించాయి. వ్యవసాయం చేయకుండానే సర్కార్ ఇచ్చే సాయంతో భూస్వాములు పేద రైతుల భూములను కొని బలిసిన భూస్వాములుగా మారుతున్నారని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే 2018లో సీఎం కేసీఆర్ రైతు బంధు డబ్బులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన బాటలోనే మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు గివ్ ఇట్ అప్ చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు బంధును వదులుకున్నా మేము హీరోలమని ప్రచారం చేసుకున్నారు. జనం కూడా ఈ నేతల మాటలను విశ్వసించారు. ఆ తరువాత జనాలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదనుకున్నరేమో ఏమో మళ్ళీ రైతు బంధు సాయాన్ని వెనక్కి ఇవ్వడం మానేశారు అధికార పార్టీ నేతలు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు రైతు బంధు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
రైతు బంధు సాయం ఇంకా అందక పోవడం పట్ల బీఆర్ఎస్ లీడర్లు అధికారులను అడిగితే నిధులు సమస్య కారణమని చెబుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు ఈ విషయమై కేసీఆర్ తో మాట్లాడాలని అనుకుంటున్నారు. కాని ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. మీడియా ముంగిట పెద్ద పులులా గాండ్రించే మంత్రులు కేసీఆర్ వద్ద మౌనం వహించడం తప్ప మరేం చేయరు. కేసీఆర్ అన్నదానికి తలాడించడమే వారి పని. కానీ రైతు బంధు అందకపోవడం ఒక్క రైతుల సమస్యే కాదు సొంత సమస్యగా భావిస్తున్నారు మంత్రులు. అందుకే తొందరలో ఈ విషయమై కేసీఆర్ తో డిస్కస్ చేయాలనుకుంటున్నారు.
ఇంతకీ రైతుబంధును కొనసాగించాలని అనుకుంటున్నారా..? లేక రైతు బంధు స్థానంలో మరో కొత్త పథకం ఏమైనా తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అనే విషయంపై కేసీఆర్ ను కలిసి చర్చించాలని అనుకుంటున్నారు. రైతుబంధు సాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని కేసీఆర్ గతంలో ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఈ పథకం అమలుకు నిధుల సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో నిధుల సమస్య నుంచి బయటపడేందుకు రైతు బంధు స్థానంలో రైతులకు పెన్షన్ అనే స్కీమ్ ను తీసుకురానున్నారా..? అని కేసీఆర్ ను కలిసి మంత్రులు మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.