తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న బీజేపీకి అనుబంధ సంఘాలు వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయించుకున్నాయి. ఆర్ఎస్ఎస్ అగ్రనేత బీఎల్ సంతోష్ ను కేసీఆర్ టార్గెట్ చేయడం పట్ల ఆర్ఎస్ఎస్ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు.
ఇన్నాళ్ళు తెలంగాణపై పెద్దగా దృష్టి సారించని ఆర్ఎస్ఎస్ పెద్దలు ఫామ్ హౌజ్ కేసులో బీఎల్ సంతోష్ ను బీఆర్ఎస్ అధినేత ఇరికించాలని చూడటంతో కేసీఆర్ పతనమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈమేరకు హైదరబాద్ లో ఆర్ఎస్ఎస్ తోపాటు హిందుత్వ సంఘాల కీలక నేతలు సమావేశమై చర్చించారు.
డిసెంబర్ లో తెలంగాణ పర్యటనకు వచ్చిన బీఎల్ సంతోష్ తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు పర్యవసానాలు అనుభవించాల్సిందేనని కేసీఆర్ ను హెచ్చరించి వెళ్ళారు. ఆ ఫలితాలు ఎలా ఉంటాయో కాని బీఆర్ఎస్ ను ఓడించేందుకు బీజేపీ అనుబంధ సంఘాలు కూడా తమ శక్తిని వినియోగించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.
బీఎల్ సంతోష్ బీజేపీలో పవర్ ఫుల్ లీడర్. ఆర్ఎస్ఎస్ తరుఫున ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన పదవులను ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తుంటారు. అలాంటి నేతను బీఆర్ఎస్ అప్రతిష్టపాలు చేసిందని ఆర్ఎస్ఎస్ నేతలు కేసీఆర్ పై ఆగ్రహంగా ఉన్నారు. అందుకే కేసీఆర్ ను వదిలేదేలేదని..తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కృషి చేసి కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్తగా బీజేపీ అధికారం ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించడంలో ఆర్ఎస్ఎస్ పాత్రను ఎవరూ కాదనలేరు. తెరవెనక ప్రచారం చేస్తూ బీజేపీ విజయానికి కృషి చేసింది. త్రిపుర, అసోం లాంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందంటే దానికి కారణం ఆరెస్సెస్ ఏళ్ల తరబడి ప్రణాళికాబద్దంగా పని చేయడమే.
ఈసారి కేసీఆర్ వలన ఆర్ఎస్ఎస్ చూపు తెలంగాణపై పడింది. ఇప్పటికే తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై ఆర్ఎస్ఎస్ ఓ నివేదిక తయారు చేసుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2023ఎన్నికల ఏడాది కావడంతో బీజేపీకి తెరవెనక ఉంటూ ఆర్ఎస్ఎస్ కీలక సూచనలు చేస్తోందని అంటున్నారు. పార్టీ బలోపేతం, అభ్యర్థుల ఎంపికపై సూచనలు చేయనున్నారు. ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగితే తెలంగాణలో బీజేపీ పని సులువు అవుతుంది. అప్పుడు కేసీఆర్ కు మరింత కష్టంగా మారుతుంది.