ఆస్కార్ బరిలో ఈసారి ఇండియా కూడా నిలిచింది. భారతదేశానికి చెందిన చాలా సినిమాలు షార్ట్ లిస్టు అయ్యాయి. ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్, రిషబ్ శెట్టి కాంతార చిత్రంతో పాటు వివాదాస్పద చిత్రంగా నిలిచిన ది కాశ్మీర్ ఫైల్స్ చోటు దక్కించుకున్నాయి.
95వ ఆస్కార్ అవార్డ్స్ కోసం వరల్డ్ వైడ్ గా 301 చిత్రాలు పోటీ పడుతున్నాయి. జనవరి 12 నుంచి 17వ వరకు షార్ట్ లిస్ట్ అయిన చిత్రాలు ఓటింగ్లో నిలుస్తాయి. ఆయా విభాగాల వారీగా అత్యధిక ఓట్లు పొందిన సినిమాలు నామినేషన్స్ లో చోటు దక్కించుకుంటాయి. ప్రతి విభాగం నుంచి ఐదేసి చిత్రాలు నామినేషన్ లో నిలుస్తాయి. అలా వాటిలో ఒకటి ఫైనల్ గా విన్నర్ గా నిలుస్తుంది. వరల్డ్ వైడ్ చిత్రంగా ఓ సినిమా గుర్తింపు పొందటం జరుగుతుంది. ఆస్కార్ అవార్డ్ గెలుచుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాని అదంతా ఈజీ కాదు. ప్రపంచవ్యాప్తంగా సినిమాలతో పోటీ పడి అవార్డ్ గెలవడమంటే అంత ఆషామాషీ కాదు.
ఇక ఆస్కార్ బరిలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా గంగూబాయి కతియావాడి, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ది కాశ్మీర్ ఫైల్స్, అలాగే సంచలన విజయం నమోదు చేసిన రిషబ్ శెట్టి డైరెక్టోరియల్ కాంతార ఆస్కార్ నామినేషన్స్ లో షార్ట్ లిస్ట్ అయ్యాయి.
అలాగే మరాఠీ చిత్రాలైన ‘మే వసంతరావు’, ‘తుజ్యా సతీ కహీ హై’, ఆర్ మాధవన్ నటించిన బయోపిక్ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ షార్ట్ లిస్ట్ లో చోటు సంపాదించాయి. ఇక ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు అధికారిక ఆస్కార్ ఎంట్రీ ఛెలో షో కూడా జాబితాలో ఉంది. అలాగే ఇరవిన్ నిజల్ , కన్నడ చిత్రం విక్రాంత్ రోనా. శౌనక్ సేన్ తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఆల్ దట్ బ్రీత్స్, కార్తీకి గోన్సాల్వ్స్ ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ షార్ట్ లిస్ట్ అయ్యాయి.
ఆర్ ఆర్ ఆర్ మూవీ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్స్ లో చోటు సంపాదిస్తుందని అందరూ బలంగా నమ్ముతున్నారు. నేడు అదే విభాగంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. ఈ క్రమంలో ఆస్కార్ ఆశలు మరింత బలపడ్డాయి. మరి ఈసారైన ఇండియా ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.