రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుటపడుతోందని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు.
రిషబ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, అతను జట్టులోకి తిరిగి రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. పంత్ పూర్తిగా కోలుకోవడానికి ఎనిమిది నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ మోకాలికి తీవ్ర గాయమైంది. దీంతో అతని మోకాలికి సర్జరీ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ సర్జరీ చేయాల్సి వస్తే రిషబ్ ను ఇప్పట్లో గ్రౌండ్ లో చూసే అవకాశం ఉండదు.
ఎనిమిది నెలల తరువాత పంత్ కోలుకున్నా ప్రాక్టీస్ చేయడానికి మరింత సమయం పడుతోంది. అంటే దాదాపు సంవత్సరం తరువాతే పంత్ పునరాగమనం ఉండనుంది. ఈ సమయంలోనే టీమిండియా ఆస్ట్రేలియా సిరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలు ఆడాల్సి ఉంది.
దీంతో ఈ టోర్నీలకు పంత్ దూరమయ్యే అవకాశం ఉంది. వీటితోపాటు త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ కు కూడా పంత్ దూరం కానున్నాడు. తనదైన సమయంలో చిచ్చరపిడుగులా చెలరేగే రిషబ్ పంత్ ఈ కీలక టోర్నీలకు దూరం కానుండటం టీమిండియాకు లోటే.
డిసెంబర్ 30న పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా.. పంత్ కారు అదుపుతప్పింది. డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అవతలి వైపునకు వెళ్లిపోయింది. డీజిల్ లీకవడం వల్ల మంటలు అంటుకొని.. కారు మంటల్లో కాలిపోయింది.
దాంతో రిషబ్ పంత్ కారు అద్దాలను పగలగోట్టుకొని ప్రాణాలతో బయట పడ్డాడు. అటుగా వెళ్తున్న హర్యానా రోడ్ వేస్ బస్ డ్రైవర్ ఆయన్ను కాపాడి..స్థానిక ఆస్పత్రికి తరలించారు.