మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కసరత్తును ముమ్మరం చేశారా..? ఓటమి ఎరుగని నేతగానున్న ఎర్రబెల్లికి ఓటమి రుచి చూపించేందుకు పాలకుర్తిలో ధీటైన అభ్యర్థిని రేవంత్ ఎంపిక చేశారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
పాలకుర్తిలో ఎర్రబెల్లిని ఓడించేందుకు రేవంత్ అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించారు. ఎర్రబెల్లిపై పోటీకి కాంగ్రెస్ తరుఫున ఎవరిని బరిలో నిలిపితే గెలుస్తారు..? గెలుపు అవకాశాలు ఎక్కువగానున్న నేత ఎవరు..? అనే అంశాలపై ఫోకస్ పెట్టిన రేవంత్.. ఎర్రబెల్లికి ఓటమి పరిచయం చేసేందుకు ధీటైన అభ్యర్థిని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
పాలకుర్తి ప్రజల్లో మంచి ఇమేజ్ కల్గిన హనుమండ్ల ఝాన్సీరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలపాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా మహిళ నేత కావడం కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు. ఎన్ఆర్ఐ అయిన ఝాన్సీరెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితురాలు. 25ఏళ్ల క్రితమే నియోజకవర్గంలో 30పడకల ఆసుపత్రిని నిర్మించి ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో ఝాన్సీరెడ్డిపై నియోజకవర్గ ప్రజలందరికీ పార్టీలకతీతంగా అభిమానం ఉంది.
ఝాన్సీరెడ్డిని కాంగ్రెస్ తరుఫున పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది..? గెలుపు అవకాశాలు ఎంత మేర ఉన్నాయి..? అనే అంశాలపై రేవంత్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, పాలకుర్తిలో భారీ బహిరంగ సభను నిర్వహించి అక్కడ ఎర్రబెల్లికి వణుకు పుట్టించాలని రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో ఎర్రబెల్లిపై అసంతృప్తితోనున్న నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేలా ప్రత్యేక వ్యూహం అమలు చేయలనుకుంటున్నారు. అంతేకాకుండా ఎర్రబెల్లి వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కనుక, స్థానికత పేరుతో పాలకుర్తిలో ఎర్రబెల్లికి చెక్ పెట్టవచ్చునని రేవంత్ అండ్ కో భావిస్తోంది. ఝాన్సీరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తే అన్ని వర్గాల మద్దతు పార్టీకి లభ్యం అవుతుందని తద్వారా ఎర్రబెల్లిని ఇంటికి సాగనంపవచ్చునని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.