రేవంత్ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. ఓ వైపు రేవంత్ తన నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పావులు కదుపుతూనే మరోవైపు బీఆర్ఎస్ పై ఎదురుదాడికి దిగుతు హీట్ పుట్టిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహించి గులాబీ పార్టీ గుండెధైర్యం దెబ్బతీయాలని చేరికలపై ప్రత్యేక దృష్టిసారించారు రేవంత్.
మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకునేలా ఆయన నడిపిన మంత్రాంగం ఫలించింది. బీఆర్ఎస్ రంగంలోకి దిగకముందే ఎవరికీ తెలియకుండా చేరికల ఆపరేషన్ ను రేవంత్ కంప్లీట్ చేస్తూ అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తీగల కృష్ణారెడ్డితోపాటు ఆయన కోడలు అనితా రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. అనితా రెడ్డి జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. పదవిలో ఉన్నప్పటికీ ఆమె బీఆర్ఎస్ ను వీడెందుకు నిర్ణయం తీసుకున్నారు.
సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరడంతో మహేశ్వరం టికెట్ తనకు దక్కేలా లేదని తీగల ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తీగలకు ప్రాధాన్యత కల్గిన పదవి ఇస్తారని కొన్నాళ్ళుగా ప్రచారం జరిగినా అదంతా ఉత్తిదేనని తేలింది. అయితే ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం , గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు భార్య భువనేశ్వరి, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్‌రెడ్డి తదితరులు ఖర్గే సమక్షంలో గురువారం కాంగ్రెస్‌లో చేరనున్నారు.
అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఈ స్థాయిలో చేరికలు ఉండటం కాంగ్రెస్ కు శుభ గడియలు ప్రారంభమయ్యాయని చెప్పేందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.