టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాలి మాటలు అసలే మాట్లాడరు. ఆయనకు పక్కాగా సమాచారం ఉంటేనే నోరు మెదుపుతారు. అలాంటిది తాజాగా రేవంత్ చేసిన ఓ ప్రకటన రాజకీయ వర్గాల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసినట్లుగా భావిస్తున్నారు.
సోమవారం రైతు సమస్యలపై వికారాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రైతుల పట్ల కేసీఆర్ అవలంభిస్తోన్న వ్యతిరేక విధానాలను తూర్పారబడుతు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చునని అందుకు పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలంటూ రేవంత్ పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికలు ఉండవని షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ పదేపదే చెబుతున్నా, ప్రస్తుతం అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం వేగం పెంచడం చూస్తుంటే ముందస్తుకు తధాస్తు అని కేసీఆరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చు.
పరిస్థితులను అంచనా వేసి రేవంత్ ముందస్తుపై ప్రకటన చేశాడో లేక ఎక్కడి నుంచైనా సమాచారం వచ్చిందో తెలియదు కానీ, ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చునని రేవంత్ చేసిన ప్రకటనతో రాజకీయ పరిశీలకులు సైతం స్పష్టతకు వస్తున్నారు. ఆషామాషీగా రేవంత్ ఎలాంటి ప్రకటన చేయడు. చేశాడంటే ఖచ్చితమైన సమాచారం ఉండే ఉండాలి. సో, రేవంత్ ప్రకటనతో పార్టీ శ్రేణులతోపాటు ప్రత్యర్ధి పార్టీలు కూడా ముందస్తుపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.