అధికారంలోకి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్సేనని ఓ వైపు కారు పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా…బీఆర్ఎస్ పనైపోయింది, అధికారంలోకి మేమే వస్తున్నామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్ – కాంగ్రెస్ లపై జనాలకు నమ్మకం సన్నగిల్లిందని అధికారం తమదేనని బీజేపీ స్వరం వినిపిస్తోంది. ఇలా అధికారం మాదంటే మాదేనని మూడు పార్టీలు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా రేవంత్ విడుదల చేసిన సర్వే రిపోర్ట్ కలకలం రేపుతోంది.
గతంలో కాంగ్రెస్ పార్టీకి 80సీట్లు వస్తాయని పదేపదే చెప్తూ వచ్చిన రేవంత్.. సర్వేలో మాత్రం కాంగ్రెస్ కు 45సీట్లు వస్తాయని అలాగే బీఆర్ఎస్ కూడా 45సీట్లకే పరిమితం అవుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీకి మాత్రం ఏడు సీట్లు వస్తాయని పేర్కొన్నారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఒకే సీట్ గెల్చిన బీజేపీకి కాస్త హైప్ పెరగడంతో ఆరు సీట్లు పెరుగుతాయని చెప్పడం ఈ సర్వేకు విశ్వసనీయత ఏర్పడేలా చేసింది. అంతేకాకుండా కాంగ్రెస్ పవర్ లోకి వస్తుందని చెప్పలేదు కానీ 45సీట్లు వస్తాయని సర్వే నివేదికను రిలీజ్ చేయడం వెనక రేవంత్ వ్యూహం ఏంటో పార్టీ నేతలకు కూడా అంతు చిక్కడం లేదు.
బీఆర్ఎస్ – కాంగ్రెస్ మద్యే హోరాహోరీ ఫైట్ ఉంటుందని చెప్పడానికి రేవంత్ ఈ సర్వేను రిలీజ్ చేసినట్లు ఉందని అంటున్నారు. బీజేపీకి ఓటేసినా అది వ్యర్థమే అవుతుందని జనాల్లో ఓ రకమైన భావనను క్రియేట్ చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు 70 -80స్థానాలు వస్తాయని సర్వేను వదిలితే ఆ సర్వేకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. రేవంత్ కూడా అదే చేశారు. బీఆర్ఎస్ కు కూడా గెలిచే అవకాశం అంతంత మాత్రమే ఉందని సర్వే ద్వారా చెప్పడంతో తటస్థ ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని రేవంత్ ఈ సర్వేను రివీల్ చేసినట్లు కనబడుతోంది.
బీజేపీలో కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు. వారంతా బీఆర్ఎస్ కు ప్రత్యామ్నయంగా బీజేపీ మారుతుందని అప్పట్లో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. కానీ ఆ నేతలకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. బీజేపీ – బీఆర్ఎస్ మధ్య సఖ్యత ఉందని అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్మకం కలిగితే చాలు గోడ దూకేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆ నమ్మకం రేవంత్ కల్గించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి బీఆర్ఎస్ ను గద్దె దించే సీన్ లేదని అర్థం చేయించేందుకు ఈ సర్వే ఉపయుక్తంగా ఉంటుందని నమ్ముతున్నారు.
రేవంత్ సర్వే కొట్టిపారేసిందిలా కూడా ఎం లేదు. నమ్మశక్యంగానే ఉంది కనుక బీజేపీ, బీఆర్ఎస్ అసంతృప్త నేతలు తొందర్లోనే హస్తం గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. చేరికల కోసమే ఈ భారీ మిషన్ ను రేవంత్ చేపట్టినట్లు కనిపిస్తోంది.
Also Read : 80 మంది అభ్యర్థులతో తొలి జాబితా…కేసీఆర్ ఎప్పుడు ప్రకటిస్తారంటే..?