తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఖరారు అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9నుంచి ఈ పాదయాత్ర కొనసాగనుంది. ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేసిన సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అవ్వగానే పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని భావించారు. కాని కొంతమంది సీనియర్లు పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో రేవంత్ రెడ్డి కూడా వేచిచూసే ధోరణి అవలంభించారు. ప్రస్తుతం సీనియర్ల ముసుగు రాజకీయం అధిష్టానంకు కూడా తెలియడంతో పార్టీ బలోపేతం కోసం రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ ఇచ్చింది అధిష్టానం.
మునుగోడు ఉప ఎన్నికతోపాటు భారత్ జోడో యాత్రను ఒంటి చేత్తో సమన్వయము చేశారు రేవంత్. ఆయన పనితీరుకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఫిదా అయ్యారు. అదే సమయంలో తెలంగాణలో తాను చేపట్టాలనుకున్న పాదయాత్ర ఇష్యూను రాహుల్ చెవిలో వేయడంతో… రేవంత్ ను అభినందించడమే కాకుండా ఇందుకు అంగీకరించారు.
రేవంత్ పాదయాత్రపై పార్టీ వర్గాల నుంచి అఫీషియల్ ప్రకటన వెలువడలేదు కాని, రేవంత్ టీం పాదయాత్ర ఏర్పాట్లపై తలమునకలైనట్లు సమాచారం. రాష్ట్రంలో ముందస్తు రాగాలు వినిపిస్తోన్న వేళ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే పార్టీ రాష్ట్ర అద్యక్షుడిగా తాను జనంలో, జనం మధ్య ఉండాలని.. పాదయాత్రకు రేవంత్ ప్లాన్ చేసినట్లుగా కనబడుతోంది.