టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 6నుంచి యాత్ర ఫర్ చేంజ్ పేరుతో ఆయన జనాల్లోకి వెళ్తున్నారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు.. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత గురించి ఈ యాత్రలో వివరించనున్నారు రేవంత్. పాదయాత్రకు హైకమాండ్ అనుమతి ఇవ్వడం.. ఆ తరువాత సీనియర్లు కూడా పాదయాత్రకు సహకరిస్తారమని చెప్పడంతో రేవంత్ యాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సోమవారం ఫిబ్రవరి 6 నుంచి తన పాదయాత్ర మొదలవుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గమైన మేడారం నుంచి యాత్ర ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.మొదటి విడతలో 60 రోజులు పాటు యాత్ర సాగుతుందని వెల్లడించారు. దాదాపు యాభై నియోజకవర్గాలను చుట్టేసే విధంగా రూట్ మ్యాప్ ఖరారు అయింది. మొదట విడత పాదయాత్ర పూర్తయిన అనంతరం రెండో విడత పాదయాత్రపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
పాదయాత్రతో పార్టీకి హైప్ తీసుకొచ్చేలా రాష్ట్ర నాయకత్వం తనదైన వ్యూహంతో సాగుతోంది. వివిధ సందర్భాల్లో జాతీయ నేతలు పాదయాత్రలో పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి.. యాత్ర ద్వారా నిత్యం జనాల్లో ఉండే అవకాశం ఉండటం పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాదయత్ర ప్రారంభానికి ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు అవుతారని సమాచారం. అయితే.. ఏయే నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగనుందనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.