తెలంగాణ కాంగ్రెస్ సారధి రేవంత్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ చేశారు. జనవరి జనవరి 26 నుండి జూన్ 2 వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. తమను సంప్రదించకుండా పాదయాత్రను ఎలా ప్రకటిస్తారని సీనియర్ నేతలు ప్రశ్నిస్తోన్న.. రేవంత్ మాత్రం పాదయాత్రపై వెనక్కి తగ్గే యోచనలో లేరు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకొని రోజుకు 19కి.మీ పాదయాత్ర చేయనున్నట్లు రేవంత్ తెలిపారు. దాదాపు 120రోజులకు పైగా ఈ యాత్ర ప్రతి గ్రామాన్ని టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్దం అవుతోంది. అధిష్టానం నుంచి పాదయాత్రకు అనుమతి రాలేదని సీనియర్లు చెప్తున్నా.. రేవంత్ మాత్రం పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నిజానికి గతంలోనే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలనుకున్నారు. కాని అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్కలు రేవంత్ పాదయాత్ర చేస్తే తాము చేస్తామని అడ్డు పడటంతో రేవంత్ చేయలనుకున్న పాదయాత్ర వాయిదా పడింది. ఇక, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి వ్యవహరించిన తీరుతో ఆయనకు అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రేవంత్ తోపాటు భట్టికి పాదయత్ర పర్మిషన్ వస్తుందన్న ఆశలో సీనియర్లున్నారు.
పాదయాత్ర విషయంలో రేవంత్ దూకుడు చూస్తుంటే.. ఆయనకు హైకమాండ్ నుంచి అనుమతి వచ్చి ఉంటుందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. యాత్రకు ఆటంకాలు లేకుండా కేసీఆర్ పై యుద్ధం చేసే విషయంలో పదవిని సైతం త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నారు రేవంత్. సీనియర్లు అడ్డం పడినా రేవంత్ పాదయాత్రను ఆపే అవకాశం లేదు. భారత్ జోడో యాత్రకు వచ్చిన ఆదరణ దృష్ట్యా హైకమాండ్ కూడా యాత్రను ఆపండని ఆదేశించకపోవచ్చని, ఎన్నికల ఏడాదిలో పోరాడే నేతకు కత్తి ఇవ్వక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకవేళ ఉమ్మడిగా యాత్రకు పర్మిషన్ వస్తే సీనియర్లకు కాస్త ఊరట కల్గుతుంది తప్ప రేవంత్ ను అడ్డుకున్నట్లు కానే కాదు. పైగా.. రేవంత్ నిర్వహిస్తోన్న యాత్రలో భట్టి విక్రమార్క ఇమడగలరా అనే సందేహాలు వస్తున్నాయి.