ఓఆర్ఆర్ స్కామ్ లో రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. ఈ స్కామ్ లో ప్రభుత్వ పెద్దలు, హెచ్ఎండీఏ అధికారులపై నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు. దీంతో రేవంత్ కు హెచ్ఎండీఏ లీగల్ నోటిసులు ఇచ్చింది. హెచ్ఎండీఏపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని..సంస్థ గౌరవం దెబ్బతినేలా మాట్లాడుతున్నారని, 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని రేవంత్ కు జారీ చేసిన నోటిసుల్లో పేర్కొన్నారు. లేదంటే సీరియస్ యాక్షన్స్ ఉంటాయని హెచ్చరించింది.
సరిగ్గా ఇలాంటి పరిణామం జరుగుతుందని ముందే అంచనా వేసిన రేవంత్ తేల్చుకుందామని సవాల్ చేశారు. ఓఆర్ఆర్ టెండర్ల స్కామ్, లిక్కర్ స్కామ్ కంటే వెయ్యి రెట్లు పెద్దదని అదంతా బయటకు రావాల్సిందేనని అంటున్నారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. టెండర్ ను రద్దు చేసేందుకు దీనినొక అవకాశంగా మలుచుకుంటానని రేవంత్ వెల్లడించారు.
టెండర్ ప్రక్రియకు సంబందించిన డాక్యుమెంట్ ను అధికారులు,ప్రభుత్వం బయటపెట్టలేదు. ఇది కూడా రేవంత్ కు అస్త్రంగా మారింది. ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా నమోదై ఉన్నాయి. అలాంటి సంస్థకు టెండర్లను తక్కువ రేట్లకు కట్టబెట్టడం వెనక ఎం జరిగిందో నిగ్గు తేలాలని రేవంత్ పట్టుబడుతున్నారు.
ఇన్నాళ్ళు రేవంత్ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఈ అంశంపై మాట్లాడుతున్నా పెద్దగా ప్రచారంలోకి రాలేదు..ఇప్పుడు హెచ్ఎండీఏ లీగల్ నోటిసులు జారీ చేయడంతో ప్రజల్లో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. అందివచ్చిన అవకాశంగా రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఈ అంశాన్ని ఎలా మరుగునపరుచాలో తెలియక బీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది. రేవంత్ కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందోనని టెన్షన్ ఫీల్ అవుతున్నారు.