నిరుద్యోగులకు అండగా ఉంటామని వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ చేపట్టిన బండి సంజయ్… మొదట ప్రధాని ఇంటి దగ్గర నిరుద్యోగ మార్చ్ చేపట్టాలని చురకలంటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోడీ మోసం చేశారని మండిపడ్డారు. 22 కోట్ల 6లక్షల దరఖాస్తులు వస్తే 7,22,311 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంట్‌లో ప్రధాని సమాధానం ఇచ్చారన్న రేవంత్… అంటే పార్లమెంటు సాక్షిగా నిరుద్యోగులను మోసం చేసినట్లు మోడీ అంగీకరించినట్లేనని అన్నారు.
రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు హామీ ఇచ్చి మోడీ మోసం చేశారో… బండి సంజయ్ కూడా అదే విధమైన హామీని ఇస్తున్నట్టున్నారని మండిపడ్డారు రేవంత్. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒకే రోజులో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని బండి సంజయ్ చెబుతున్నారని… ఆయన చేసిన వ్యాఖ్యలు విని నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అసలు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో బండి సంజయ్ కి అవగాహనా ఉందా..? అని రేవంత్ ప్రశ్నించారు. అవగాహనారాహిత్యంతో బండి సంజయ్ మాట్లాడుతున్నట్లు ఉందని అన్నారు.
బీజేపీ – బీఆర్ఎస్ లు కలిసి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని రేవంత్ విమర్శించారు. ఇంటికో ఉద్యోగమని కేసీఆర్, ఒకే రోజు రెండు లక్షల ఉద్యోగాలు అంటూ బండి సంజయ్ మోసం చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల తరుఫున కొట్లాడుతోంది కాంగ్రెస్ మాత్రమేనని.. కాంగ్రెస్ ఏదైనా అంశంపై పోరాడినప్పుడల్లా బీజేపీ చిల్లర పంచాయితీని ముంగిట వేసుకొని బీఆర్ఎస్ కు సహకరిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించిన రేవంత్… ఈ నెల 21న నల్గొండలో మాహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న ఖమ్మం జిల్లాలో, 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. మే 4 లేదా 5న సరూర్‌నగర్‌లో నిరుద్యోగుల సమస్యలపై భారీ సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిధిగా పాల్గొంటారని తెలిపారు.
యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్ర వాయిదా పడలేదని… మే 9నుంచి రెండో విడత పాదయాత్ర స్టార్ట్ అవుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జోగులాంబ జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగుల అంశంపై పోరాటం చేసేందుకు యాత్రకు విరామం ఇచ్చామని రేవంత్ క్లారిటీ ఇచ్చారు.