తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి బీజేపీ పెద్దలు పార్టీలో చేర్చుకోవాలనుకున్నారని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో.. తమ పార్టీ ఎమ్మెల్యేలకు సైతం భారీ మొత్తంలో ఆశ చూపించి 12మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని రేవంత్ చెప్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లడంతో… పన్నెండు మంది ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో ఇంప్లీడ్ ఇవ్వాలని కోరుతున్నారు రేవంత్.
2018 లో కాంగ్రెస్ పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన ఆయన.. పార్టీ మారిన12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ సీఎల్పీ నేతతో కలిసి ఫిర్యాదు చేయనున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరినందుకు వారికి వచ్చిన రాజకీయ, ఆర్థిక లాభాల గురించి వివరించి రేవంత్ సేకరించిన ఆధారాలను సమర్పించనున్నారు. నలుగురు ఎమ్మెల్యే కొనుగోలు కేసుపై హైకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో రేవంత్ ఫిర్యాదు సంచలనంగా మారింది.
ఎమ్మెల్యేల కొనుగోలుకేసులో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో ముగ్గురు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరిన వారే. కాంగ్రెస్ పార్టీ నుంచి 2018 లో అధికార పార్టీలోకి వెళ్లిన 12 మంది పలు రకాలుగా ప్రయోజనం పొందారని.. అది కూడా లంచం కిందకే వస్తుందని రేవంత్ చెప్తున్నారు. ఫామ్ హౌజ్ కేసును నలుగురికి మాత్రమే పరిమితం చేయకుండా.. 2018లో పార్టీ మారిన 12మందిఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని కోరనున్నారు. అదే విధంగా, 2018లో టీఆర్‌ఎస్ నాయకులు గులాబీ కూలీ పేరుతో వందల కోట్లు వసూలు చేశారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నిధుల వసూళ్లకు పాల్పడితే నేరం అవుతుంది. అది లంచం తీసుకోవడంతో సమానం. దీనిపై రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ అంశాలన్నింటిని సీబీఐకి ఫిర్యాదు చేసి గులాబీ అధినేత అవినీతిని తేటతెల్లం చేయాలని రేవంత్ భావిస్తున్నారు.
ఇకపోతే తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి చేస్తోన్న పోరాటాన్ని ప్రత్యర్ధి పార్టీల నేతలు సైతం ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. రేవంత్ పార్టీ కోసం నిస్వార్ధంగా పని చేస్తుంటే ఆయన్ను వెనక్కి లాగేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారన్నారు విజయశాంతి. టి. కాంగ్రెస్ లో ప్రస్తుతం జరుగుతున్నదిదేనని ఆమె పేర్కొన్నారు. పార్టీలో రేవంత్ కు ఎదురు అవుతున్నా పరిస్థితులను చూస్తె ఇది అర్థం అవుతుందని అన్నారామె. సమస్యలు ఎదురు అవుతున్నా చిరునవ్వుతోనే వాటికీ జవాబిస్తూ పార్టీ బలోపేతంపైనే దృష్టి పెడుతున్నారు రేవంత్. కేసీఆర్ దుర్మార్గ, అవినీతి, నియంతృత్వంపై అలుపెరగకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు.
Also Read : రేవంత్ లాజిక్ తో కేసీఆర్ పరేషాన్..!