రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగా గాంధీ భవన్ లో ‘ సంకల్ప్ సత్యాగ్రహ’ దీక్ష నిర్వహించారు. రాహుల్ గాంధీకి వస్తోన్న ఆదరణను చూసి ఓర్వలేకే రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారని.. ఇదంతా మోడీ కుట్రేనని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
ఈ సంకల్ప్ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ లో ఎదుర్కొలేకే అనర్హత వేటు వేశారన్నారు. దేశం కోసం ఎప్పుడు ముందుండే గాంధీ కుటుంబంపై మోడీ కుట్రలు పన్నుతున్నాడని అన్నారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ చేపట్టాల్సిన కార్యాచరణపై ఏఐసీసీ కసరత్తు చేస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీపై అనర్హతను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీలంతా రాజీనామా చేయాలనే అంశంపై పార్టీ చర్చిస్తోందని…ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు రేవంత్ రెడ్డి.
దేశ ప్రజల కోసం , బీజేపీ దోపిడీ దురాగతాలను ఎండగట్టాలంటే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఉండాల్సిన అవసరం ఉందని రేవంత్ అభిప్రాయపడ్డారు. అందుకే రాహుల్ గాంధీకి మద్దతుగా తాము రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తామని తెలిపారు.
రాహుల్ పై అనర్హత వేటు కంటతడి పెట్టించిందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ వదులుకున్నారని తెలిపారు. అదానీ గురించి మాట్లాడినందుకే రాహుల్ పై కుట్ర చేశారని.. పార్లమెంట్ లో ప్రశ్నిస్తారనే భయం బీజేపీలో పెరిగిందన్నారు. ఆగమేఘాల మీదపరువునష్టం కేసులో శిక్ష పడేలా చేశారు. అవసరమైతే కాంగ్రెస్ ఎంపీలందరూ రాజీనామా చేయాలని.. రాహుల్ పై అనర్హత వేటు ఎత్తివేసే వరకూ పోరాడుతామని ప్రకటించారు.