ఈ నెల 21న నల్గొండ జిల్లాలో నిర్వహించాల్సిన నిరుద్యోగ నిరసన ర్యాలీని 28వ తేదీకి వాయిదా వేసింది టీపీసీసీ. నల్గొండ జిల్లాకు చెందిన తమను సంప్రదించకుండా ఏకపక్షంగా నిరుద్యోగ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని రేవంత్ ఎలా ప్రకటిస్తారని సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము నల్గొండ జిల్లాలో నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనబోమని తేల్చి చెప్పారు.
దీంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే తోపాటు ఏఐసీసీ కార్యదర్శి నదీం జావేద్ లు ఉత్తమ్ , వెంకట్ రెడ్డిలతోపాటు రేవంత్ రెడ్డితో చర్చించారు. ఇరువురి నేతల మధ్య సయోధ్య కుదిర్చారు. అనంతరం ఈ నెల 28న నల్గొండ జిల్లాలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. దీంతో ముందుగా రేవంత్ రెడ్డి ప్రకటించిన షెడ్యూల్ లో మార్పులు చేస్తూ టీపీసీసీ ప్రకటన విడుదల చేసింది.
ఈ నెల 28వ తేదీన నిర్వహించ తలపెట్టిన మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన ర్యాలీకి రేవంత్ రెడ్డితోపాటు ఉత్తమ్, కోమటిరెడ్డిలు కూడా హాజరు కానున్నారు. నిరుద్యోగ సమస్యలపై ఒత్తిడి పెంచేందుకు సమిష్టిగా పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంతో విబేధాలు పక్కన పెడుతున్నారు సీనియర్ నేతలు.