“నేను మళ్ళీ పుట్టిన…….”
పునర్జన్మ ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం మళ్లీ పుట్టిన ఇది నిజం……..
నాది ఒకటి, రెండు తరాల చరిత్ర కాదు, భూమి పుట్టినాటి నుండి 2021 వరకు నాకు చరిత్ర ఉంది.
నాకు చావు, పుట్టుక లేదని అనుకున్నా! కానీ నేను చచ్చిపోయి మళ్లీ పుట్టిన!….
నా పేరు “ఏటిగడ్డ కిష్టాపూర్” (తిరుమలగిరి (పల్లె),లంబాడి తండా) మండలం తొగుట, జిల్లా సిద్దిపేట నేను ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం పుట్టానో నాకే తెలియదు! నేను అనుకుంటున్నా మానవజాతి పుట్టినప్పుడే నేను పుట్టానని! 2021లో నన్ను చంపితే రెండు చోట్ల అన్ని అంగవైకల్యాలతో పుట్టాను. కొంత నా గత చరిత్రను మీకు చెబుతున్నాను వినండి…..
నేను (వాగు) ఏరు గడ్డకు పుట్టడం మూలంగా ఏటిగడ్డ, కృష్ణారావు పాలించడం మూలంగా కృష్టాపురం గా మొత్తంగా రాను రాను నన్ను ఏటిగడ్డ కిష్టాపూర్ గా నాకు పేరు వచ్చింది. నాకు పడమర మరియు దక్షిణాన కూడవెళ్లి వాగు, తూర్పు, ఉత్తరమున దట్టమైన గిరాయిపల్లి అడవి, శివారులుగా ఉన్నాయి. వీటన్నింటి మధ్యన సుమారు సుమారు 4000 మంది నా బిడ్డలు, 600 కుటుంబాలుగా నా చుట్టూ 2800 ఎకరాల భూమిలో తెల్లారిందంటే పొలాలలో కష్టపడి అన్ని రకాల పంటలను పండించే నా రైతు బిడ్డలు. ఎక్కడ వర్షాలు పడ్డ, పడకున్న ఇక్కడ ఒక్క వాన పడితే ఉన్న 15 కుంటలతో పాటు 1911లో నిజాం ప్రభుత్వం కూడవెల్లి వాగుపై మత్తడి (ఆనకట్ట)తో పాటు, కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి గారి చొరవతో నా శివారులో రెండు చెక్ డ్యాములు. ఎప్పుడు నీళ్లతో , పచ్చటి పంటలతో కలకలాడే నేను ఇవ్వాలా నీళ్లలో శాశ్వతంగా మునిగిపోయాను.
కష్టపడి పనిచేసి రెండు పంటలు పుష్కలంగా పండించుకొని, హైదరాబాద్ కూకట్ పల్లి రైతు బజార్ కు రోజు రెండు బస్సుల నిండా తీసుకుపోయి కూరగాయలు అమ్మే నా బిడ్డలు కూరగాయల కోసం అంగళ్లు తిరుగుతున్నారు. కుల,మతాలకు అతీతంగా పండుగలు, పబ్బాలు చేసుకుంటూ కష్టసుఖాలను పంచుకుంటూ నా బిడ్డలు చాలా సంతోషంగా బతికేవారు. ఇప్పుడు జాగ భూమి లేక, పని పాట లేక ఇండ్లు సరిగా లేక విలవిలలాడుతుంటే నా ప్రాణం వెళ్ళిపోతుంది. నా అడివి బంగారు తల్లి నా అడవిలో గొర్రెలు, మేకలు, పశువులు మేపుకుంటూ బతికేవారు. దీనితో పాటు నా అడవిలో ఇల్లు కట్టుకోవడానికి, వంట వండుకోవడానికి కట్టే, రాయి, సీతాఫలాలు, చీపురు కొయ్యలు, బీడీల ఆకు, ఇస్తారు ఆకులు, జీడి పండ్లు నమ్ముకొని, అమ్ముకొని బతికేవారు. ఇప్పుడు నా బిడ్డలకు అడవి లేదు ఆస్తులు లేవు. నాకు చుట్టు కాపలాగా గ్రామ దేవతలు దక్షిణాన హనుమాన్లు, తూర్పున గట్టుగుట్ట ఆంజనేయస్వామి ,తల్లి దీకొండ మైసమ్మ నా నడిబొడ్డున బొడ్రాయి, ఆంజనేయస్వామి, శివాలయం, అటు పక్కన వెంకటేశ్వర స్వామి దేవాలయం, గడీల మైసమ్మ తల్లి ఇప్పుడు నన్ను కాపాడడానికి నా చుట్టూ ఒక్క దేవత కూడా లేదు? నా కడుపుల ఎన్ని మాయిముంతలో ఎన్ని శవాలను దాచిపెట్టుకున్నానో, ఇప్పుడు ఇక్కడ బొంద పెడదామంటే ఆరడుగుల జాగనే కరువాయే! ఇంకా లెక్కలేనన్ని నా బిడ్డలను కాపాడుకుంటానని ఆశపడ్డాను కానీ ఇప్పుడు నన్ను నేనే కాపాడుకోలేక విలవిలలాడుతూ చనిపోయాను.
ఇప్పుడు నా బిడ్డలు గూడు చెదిరిన పక్షులోలే, తల్లిని విడిచిన పిల్లలోలే, చెట్టుకొకరు, పుట్ట కొకరు నా పిల్లలు నా నుండి విడిపోతే నేను తల్లడిస్తూ ప్రతిక్షణం బాధపడుతున్నాను. నా పిల్లలకు పని లేక మద్యానికి బానిసై మట్కా ఆడుతుంటే నేను చూడలేకపోతున్నా? పక్షుల కిలకిల రాగాలతో, పాలధారలతో, కోడికూతలతో నిద్రలో నుంచి లేచిన నా ఆడబిడ్డలు ఇంటి పని మగ బిడ్డలు పొలాలకు పోయేవారు. ఇప్పుడు పొలం లేక భవిష్యత్తులో మేము ఎట్లా బతుకాలని నా బిడ్డల ముఖాల్లో ఒక ప్రశ్న? ఆ ప్రశ్న? ఎప్పుడు ప్రశ్నగానే ? ఉంటుంది. వారి పని వారికే సరిపోయే నా బిడ్డలు ఇప్పుడు అడ్డా కూలీలుగా మారండ్రు. ఏమి పని లేక ప్రతిక్షణం మదన పడుతూ బతుకుతున్నారు. నా దగ్గర ఉన్నప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరిని చూసినా మాకెందుకు ఈ బతుకు అన్నట్లుగా ఆ బిడ్డల ముఖాలు కనబడుతున్నాయి. గొర్లు,మేకలు మేపుకోవడానికి అడవులు లేక గొల్ల కురుమలు జీవాలను “అడ్డికి పావు షేరు”లెక్క అమ్ముకొని జీవచ్ఛవాల్ల బతుకుతున్నారు. పుట్లకొద్ది వడ్లు పండించిన నా బిడ్డలు బుక్కెడు బువ్వ కోసం తండ్లాడుతున్నారు. ఏ పని తోచక గుండెపోటు, రక్త పోటు, మతి భ్రమించి నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు. నా గౌడ బిడ్డలు నన్ను విడిచి పెట్టలేక 15 కిలోమీటర్లు వచ్చి కల్లు గీసుకుంటున్నారు. ఆడబిడ్డలు 20 నుంచి 25 కిలోమీటర్లు ఆటోలో కూలికి పోతే ఏదైనా జరగరానిది ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతున్న!
ఇప్పుడు నా పేరు ఏటిగడ్డ కిష్టాపూర్ 1, 2 R/R కాలని గా మారింది. నా శరీరం రెండు ముక్కలయ్యింది. నా పేరుతో మంచిగా బతికిన నా బిడ్డలు రేపు రేపు ఇంకా ఎన్ని కష్టాలతో బతుకుతుంటే, నా పిల్లలు నన్ను ఎంత నిందిస్తారో అని నేను పుట్టకపోతే బాగుండని అనుకుంటున్నాను.
నన్ను ,నా పిల్లలను 50 TMC ల నీళ్ల కోసం మల్లన్నసాగర్ పేరుమీద మాకు ఇష్టం లేకున్నా మమ్ములను పూర్తిగా నీళ్లల్లో ముంచిరి. ఇప్పుడు గజ్వేల్ పక్కకు రెండు జాగల్లో R/R కాలనీ పేరు మీద ఏటిగడ్డ కిష్టాపూర్ అని నన్ను రెండు ఊర్లుగా విడదీసిరి. నా పేరు మీద ఊరు కట్టకపోయినా బాగుండేది? (ఇట్లా 14 ఊర్ల అస్తిత్వం పోయి బెంగటీలుతు చస్తూ బతుకుతున్నారు.)
ఊరంటే 250 గజాలలో ఒక చిన్న ఇల్లు, ఇంటి ముందర సిసి రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని ప్రభుత్వం అనుకుంటుంది. ఇక్కడ ఒక్కే ఊరైన అక్కడ పక్కకున్న ఇండ్లు ఇక్కడ లేవు! ఇక్కడ చుట్టు కాంపౌండ్ వాల్ పెట్టుకోవడంతో మానవ సంబంధాలు కనుమరు అవుతున్నాయి.
కానీ ఊరు అంటే తరతరాలుగా ఆ భూమితో ఆ మనుషులు పెనవేసుకున్న అనుబంధం. కష్టసుఖాల్లో పాలుపంచుకున్న బంధం, పంట పొలాలు, చెట్టు చేమ, చెరువుకుంటలు, అడవులు, గొడ్డు గోదా, గొర్లు,మేకలు, ఆటపాట, గ్రామ దేవతలు, ఊరంటే ఆప్యాయత అనుబంధాలకు పెట్టింది పేరు. అది మరిచిన పాలకులు నన్ను చంపి ఇంకొక దగ్గర నిర్మిస్తే నేను ఎట్లా ఏటిగడ్డ కిష్టాపూర్ ను అవుతా!…..…….
పులి రాజు,
సామాజిక కార్యకర్త,
9908383567.