పుష్ప క్రేజ్ తో వాపును చూసి బలుపు అనుకున్నాడు బన్నీ. అది ఆయన తప్పిదమా? లేకపోతే చుట్టూ ఉన్న మందీ మార్భలం చూపించిన అత్యుత్సాహమా? అన్న చర్చ విస్తృతంగా నడుస్తోంది. నిజానికి అల్లు అర్జున్ అరెస్టు విషయంలో పోలీసులు ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు. సెలబ్రెటీ అరెస్టు కాబట్టి శాంతిభద్రతల సమస్యను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారు. అందుకే మొత్తం ఎపిసోడ్ చాలా ప్రశాంతంగా సాగింది. ఆయన్ను అదుపులోకి తీసుకోవడం తర్వాత నిబంధనల ప్రకారం ఆస్పత్రికి, కోర్టుకు తీసుకెళ్లడంలో ఎక్కడా జాప్యం చేయకుండా కట్టుదిట్టంగా సాగింది ప్రక్రియ. దీనిపై పోలీసు శాఖను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.
అయితే అసలు అల్లు అర్జున్ అరెస్టుకు ఆయన సొంత మేనేజర్ చేసిన నిర్వాకమే కారణమన్న విషయం బయటకు పొక్కింది. సంధ్యా థియేటర్ ఘటనపై రెండు రోజుల తర్వాత స్పందించిన అల్లు అర్జున్…బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. దీంతో అంతా ప్రశాంతమే అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ మేనేజర్ అంతర్గతంగా చేసిన వ్యాఖ్యలు ఆ నోటా ఈ నోటా పడి పూర్తిగా వైరల్ అయ్యాయి. తొక్కిసలాట జరిగి ఒకరిద్దరు చనిపోకపోతే మా హీరో మీదున్న క్రేజ్ పబ్లిక్ కు ఎలా తెలుస్తుంది సర్ అంటూ మేనేజర్ మాట్లాడాడు. ఇలాంటి వ్యాఖ్యలు, వ్యవహారశైలిని ఏ మాత్రం సహించేది లేదనుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బన్నీ అరెస్టుకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేశారు. దీని ద్వారా కేవలం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు పాన్ ఇండియా లెవల్ లో హాట్ టాపిక్ గా మారారు. అంతేకాదు యంగ్ హీరోలు బయటకు బన్నీని సపోర్ట్ చేస్తున్నప్పటికీ…తమ సినిమా విడుదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చర్చించుకుంటున్నారు. బౌన్సర్లను పెట్టి హల్ చల్ చేయడం హీరోయిజం కాదు…ఫ్యాన్స్ క్రౌడ్ ను చూడగానే హీరోయిజం చూపించడం కాదు అని తెలుసుకున్నారు.
ఇక సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదనే విషయం కూడా అందరికీ తెలుసు. తాము వద్దన్నప్పటికీ అల్లు అర్జున్ తన మందీ మార్భలంతో అక్కడికి వచ్చి హల్ చల్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసేందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా బన్నీ ఓపెన్ టాప్ పైకి ఎక్కి అభివాదం చేశాడు కానీ ఫ్యాన్స్ ను వద్దని వారించలేదు. పైగా అల్లు అర్జున్ వచ్చిన సమయంలో గేట్ల దగ్గర బౌన్సర్ల అత్యుత్సాహం అంతా ఇంతా కాదు కనపడ్డవారిని తోసేస్తూ…ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. ఇది కూడా తొక్కిసలాటకు ప్రధాన కారణమైంది. ఇదంతా అంతర్గత చర్చల్లో పుష్ప టీం కూడా ఒప్పుకుంది.
కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు ఇటీవల మంచు ఫ్యామిలీ ఇష్యూలోనూ ఇదే తరహాలో ప్రైవేట్ బౌన్సర్లను పెట్టి హల్ చల్ చేశారు. దీంతో రాచకొండ పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు జరిగిన ఘటనతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కఠినంగా వ్యవహరిస్తోంది. కానీ హీరోలు అని చెప్పుకుంటున్న నటులు మాత్రం గుణపాఠాలు నేర్వడం లేదు. తాము హీరోలం అన్న భావన నుంచి బయటకు వస్తేనే విషాదాలను ఆపవచ్చు. ఇప్పటికైనా ఫిల్మ్ ఇండస్ట్రీ దీనిపై ప్రొడ్యుసర్లు, హీరోలకు మార్గదర్శకాలు ఇస్తుందని అంతా ఆశిద్దాం