మహారాష్ట్ర ఎన్నికల్లో కారు హారన్ మూగబోయింది. రెండేళ్ల క్రితం ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారిన భారత రాష్ట్ర సమితి..తమ మొదటి టార్గెట్ మహారాష్ట్ర ఎన్నికలే అని ప్రకటించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన హడావుడి, ప్రచార ఆర్భాటం అంతా ఇంతాకాదు. మేం అడుగు పెట్టగానే అక్కడి నేతల గుండెల్లో వణుకు మొదలైందని కేసీఆర్ సభల్లో స్వయంగా ప్రకటించుకున్నారు. వందలాది కార్లతో రోడ్ షో..మాజీ వార్డు మెంబర్ల నుంచి మాజీ సర్పంచ్ లు, జెడ్పీటీసీలు, ఒకరిద్దరు ఎన్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలకు గులాబీ కండువాలు కప్పేశారు. ఇక మహారాష్ట్ర రైతుల జీవితాలు బాగు చేసేవరకు విశ్రమించేది లేదని స్పీచ్ లు దంచికొట్టారు. అయితే ఏడాదిలోపే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్సయింది. దీంతో కారు పార్టీ అధినేత ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. రైతుల జీవితాలను బాగు చేసేవరకు తనకు విశ్రాంతి లేదన్న కేసీఆర్…ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతుంటే కాలు కూడా బయటపెట్టడం లేదు.
నిజానికి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలకు వెళ్లినప్పుడు ఇక్కడి ప్రజలు రైతుల నోటి నుంచి వినిపించిన మాట ఒక్కటే. ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందంట? అనే సామెతను గుర్తు చేసుకున్నారు. ఇక్కడ రైతుల సమస్యలు గాలికొదిలేసి..ఇతర రాష్ట్రాల్లో బాగు చేస్తాడా? అంటూ పెదవి విరిచారు. ఇప్పుడు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఇదే చర్చ నడుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికలు తుది దశకు వచ్చేశాయి. మరో వారం రోజుల్లోపే ఫలితాలు కూడా వస్తాయి. కానీ కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదేంటి అని ప్రశ్నిస్తున్నారు.
ఒకవైపు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కోసం సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆయన చరిష్మాతో కాంగ్రెస్ కు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న నియోజకవర్గాల్లో ఆయన ప్రచారానికి అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. కాంగ్రెస్ హామీలను ఆయన వివరిస్తున్న విధానంతో ప్రజలు ఆకర్షితులవుతున్నారు. దీంతో కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి మాటల మనిషి కాదని, ఆయన చెప్పాడంటే చేస్తాడని ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు కేసీఆర్ చేసిన హడావుడిని తలచుకొని నవ్వుకుంటున్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యవహార శైలిపై కూడా చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో నేరుగా బీజేపీకి మద్దతివ్వాలని మనసులో ఉంది కానీ బయటకు చెప్పుకోలేక పరోక్షంగా మద్దతిస్తున్నాడు. మొదటి దఫా ఎన్నికల సమయంలో ఢిల్లీ టూర్ అంటూ వెళ్లి నేషనల్ మీడియాను పిలిపించుకొని హడావుడి చేశాడు. ఇప్పుడు రెండో దశలో చివరి రోజు ప్రచారం నాడు కూడా మళ్లీ ఢిల్లీకి వెళ్లారు. దీంతో బీజేపీను మేలు చేసేందుకు ఈ చిల్లర రాజకీయాలు చేయకుండా…నేరుగా కాషాయ కండువా కప్పుకొని ప్రచారం చేయవచ్చు కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. బీఆర్ఎస్-బీజేపీ రహస్య బంధం గురించి క్లారిటీ ఉన్న ప్రజలెవ్వరూ ఆయన చీప్ పాలిటిక్స్ ను పట్టించుకోరు అంటున్నారు.