తెలుగు మీడియాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందరూ చెప్పేపేరు రవి ప్రకాష్. టీవీ9 అనే శాటిలైట్ ఛానెల్ ను అతి తక్కువ బడ్జెట్ తో ప్రారంభించి.. దాని దేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించి ఛానెల్ ను దేశవ్యాప్తం చేశారు. అయితే, టీవీ9లో జరిగిన పరిణామాలు, రాజకీయం మీడియాలోకి చొరబడటంతో రవి ప్రకాష్ ఆ చానెల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఆ తరువాత ఆయన ‘తొలివెలుగు’ అనే వెబ్ ఛానెల్ ను వెనకుండి నడిపిస్తున్నారు. ఈ ఛానెల్ యూట్యూబ్ ఛానెలే అయినా శాటిలైట్ కు తీసిపోని రీతిలో తెలంగాణ ప్రజల ఆదరణను చూరగొన్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజలకు దగ్గర అయింది. ప్రస్తుతం రవి ప్రకాష్ – తెలంగాణ ప్రభుత్వ పెద్దల మధ్య సఖ్యత కుదిరింది. పార్టీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రవి ప్రకాష్ సేవలను వాడుకోవాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయింది.
ఈ నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతం వీడి మళ్ళీ తెరమీదకు రానున్నారు. ‘ఆర్ టీవీ’ పేరుతో ఇప్పటికే ఈ చానల్‌కు సంబంధించిన పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ టీవీ చానల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం రిక్రూట్ మెంట్ కొనసాగుతోంది. ఇటీవల మరింత దూకుడుగా నియామకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక టెక్నాలజీ పరంగా తెలుగు టీవీ చానళ్ల దగ్గర లేని అత్యాధునిక టెక్నాలజీని వినియోగించబోతున్నారు. బీఆర్ఎస్ కు ఫేవర్ గా ఆర్ టీవీ కథనాలు ఉండనున్నాయి.