తెలంగాణ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా కలుషితం అవుతున్నాయి. ఒకరి పుట్టుకను మరొకరు అనుమానించే సంస్కృతి తెలంగాణ రాజకీయంలో ఇదివరకు లేదు. కానీ ఇప్పుడు ఆ జాడ్యం ఏపీ నుంచి తెలంగాణకు కూడా వ్యాప్తి చెందుతోంది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పుట్టుకను అనుమానిస్తూ నీచంగా మాట్లాడారు.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై లైంగిక ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఆయన మరోసారి గెలిచే పరిస్థితి లేదు. దీంతో స్టేషన్ ఘన్ పూర్ నుంచి వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కడియం టార్గెట్ గా రాజయ్య విమర్శల డోస్ పెంచేశారు.
సొంత పార్టీ నేత అని కూడా చూడకుండా కడియం అవినీతిపరుడని, ఎన్ కౌంటర్ల సృష్టికర్త అని ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్ళీ అవినీతి ఆరోపణలు చేస్తే పస ఉండదని అనుకున్నారో ఏమో కడియం దళితుడు కాదని చెప్పేందుకు ఆయన ఎవరికీ పుట్టాడో తెలియదు అన్నట్లుగా దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. కడియం తల్లి పద్మశాలి బీసీ. ఆమె తల్లి అనేది నిజం, తండ్రి అనేది ఊహ అని మాట్లాడారు రాజయ్య.
రాజకీయాల్లో ప్రత్యర్ధులు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటారు. అవన్నీ రాజకీయంలో భాగమే. కానీ ఇలా పుట్టుకను ప్రశ్నించే స్థాయికి తెలంగాణ రాజకీయం చేరడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఇంత జరుగుతున్నా అటు రాజయ్యను కానీ, ఇటు కడియంను గాని హైకమాండ్ పిలిచి మాట్లాడి ఇష్యూను సాల్వ్ చేయడం లేదు.
Also Read : అయ్యో పాపం.. ఈటలకు మళ్ళీ కష్టమొచ్చి పడిందే..!!