ఏఐసీసీ స్ట్రాటజీ మీటింగ్ లో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై రాహుల్ గాంధీ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తనకు అంతా తెలుసునని…ఓవరాక్షన్ చేస్తే వేటు తప్పదని పేరు ప్రస్తావించకుండానే రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏదైనా అసంతృప్తి ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని సూచించిన రాహుల్…మీడియా ముందే ఓపెన్ అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తనపై సొంత పార్టీ నేతలే దుష్ప్రచారం చేయిస్తున్నారని…దీనిపై ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్ లో రాహుల్ గాంధీతో తేల్చుకుంటానని ఉత్తమ్ మీడియా ముఖంగా చెప్పేశారు. జగ్గారెడ్డి కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాహుల్ వరకు చేరాయో లేదంటే గతంలో వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకున్నారో కానీ ఈ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. పార్టీకి చేటు తెచ్చేలా ప్రకటనలు చేస్తే ఉపేక్షించేది లేదని ఘాటుగా స్పందించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కొంతకాలంగా సొంత పార్టీలోనే తమకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని ఉత్తమ్ గగ్గోలు పెడుతుండగా తాజాగా జగ్గారెడ్డి కూడా ఇదే రకమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. రాహుల్ తో మీటింగ్ కు వెళ్లేముందు కాంగ్రెస్ లోనే దరిద్రం అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి కామెంట్స్ తో పార్టీ పరువు పోతుందని అంచనా వేసిన రాహుల్ గాంధీ ఇక నుంచి సీనియర్లైనా, జూనియర్లైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. మొత్తంగా తమ వ్యవహారశైలితో పార్టీలో చిచ్చు పెట్టాలని చూసిన ఇద్దరి నేతలకు రాహుల్ ఊహించని ఝలక్ ఇచ్చి నోర్లు మూయించారు.
Also Read : 50 మందికిపైగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు వీరే ..!!?