ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో చుక్కెదురు అయింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసు విషయంలో కిందికోర్టు ఇచ్చిన తీర్పును సెషన్స్ కోర్టు సమర్ధించింది.
మోడీ అనే ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుజరాత్ ఎమ్మెల్యే పూర్నేశ్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మోడీ అనే పేరుతో ఉన్న వారంతా దొంగలేనని రాహుల్ చేసిన వ్యాఖ్యలు తమ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్నాయంటూ పూర్నేశ్ మోడీ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. దీంతో చట్టప్రకారం రాహుల్ గాంధీని లోక్ సభ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ స్పీకర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ 17విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి.
ఈ క్రమంలోనే సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ తనకు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ స్టే పిటిషన్ వేశారు. ట్రయల్ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఇదేమంత సీరియస్ కేసు కాదని.. శిక్షను నిలుపుదల చేయాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ పిటిషన్ ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. కింది కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలనే రాహుల్ గాంధీ వాదనను తోసిపుచ్చింది. రాహుల్ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్పీ మొగేరా తాజాగా తీర్పును వెలువరించారు.
Also Read : రాహుల్ గాంధీ అంటే బీజేపీకి ఎందుకంత భయమో చదవండి