వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నర్సంపేట సంఘటనపై మోడీ వాకబు చేశారని వైఎస్సార్ టీపీ శ్రేణులు ప్రకటిస్తున్నాయి. అయితే ఈ వార్తను బీజేపీ వర్గాలు ఖండిస్తున్నాయి. మోడీ నేరుగా షర్మిలకు ఫోన్ చేసే అవకాశం లేదని అంటున్నాయి. అదే సమయంలో మోడీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పడం కష్టమే కాబట్టి షర్మిలకు ఫోన్ చేసి ఉండొచ్చునన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్రపతి భవన్ లో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం మధ్య చర్చ సందర్భంగా షర్మిలపై దాడి జరిగితే ఎందుకు స్పందించలేదని జగన్ ను మోడీ ప్రశ్నించారనే ప్రచారం జరిగింది. ఓ కీలక సమావేశంలో షర్మిల ఇష్యూను వీరిద్దరూ చర్చించే అవకాశం లేదన్నది ఎక్కువమంది అభిప్రాయం. అయితే, కేసీఆర్ ను టార్గెట్ చేసేందుకుగాను షర్మిలకు ప్రధాని ఫోన్ చేసి ఉంటారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అదేసమయంలో ఢిల్లీ రావాలని షర్మిలకు మోడీ కబురు పెట్టడం చర్చనీయాంశం అవుతోంది.
Also Read : కేసీఆర్ ‘ముందస్తు’ సంకేతాలు
షర్మిల బీజేపీ విసిరిన బాణమని టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. కవిత షర్మిలపై ట్వీట్ చేయగానే ఆమెతోపాటు తెలంగాణ బీజేపీ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. షర్మిలకు బాసటగా నిలబడ్డారు. ఇప్పుడు ప్రధాని కూడా ఆమెకు సంఘీభావం తెలుపుతూ ఢిల్లీకి వచ్చినప్పుడు తనను కలవాలని షర్మిలకు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. షర్మిలతో భేటీకి ప్రధాని మొగ్గు చూపడంతో త్వరలో జరగనున్న సమావేశంలో వైఎస్సార్ టీపీతో పొత్తు ప్రతిపాదన ఏమైనా తీసుకొస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎలాగూ.. షర్మిలకు వైఎస్సార్ అభిమానుల ఓటు బ్యాంక్ ఉండనే ఉంది కాబట్టి, వైఎస్సార్ టీపీతో పొత్తు పెట్టుకుంటే ఆ ఓటు బ్యాంక్ ద్వారా తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలుచుకోవచ్చునన్నది బీజేపీ ప్లాన్.
కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను కొంత షర్మిల చీల్చే అవకాశం ఉంటుందని, అందుకే ఆ పార్టీతో పొత్తు లాభిస్తుందని కమలదళం షర్మిలతో దోస్తీని ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక, ఒంటరిగా షర్మిల కూడా ఎక్కువ కాలం పాలిటిక్స్ లో రాణించే అవకాశం లేదు. కాబట్టి బీజేపీ మైత్రితో తెలంగాణలో బలపడవచ్చునని షర్మిల భావించే అవకాశాలు కూడా ఉన్నాయి.